ఎమ్మెల్యే కృష్ణదాసు సతీమణిపై పోలీసులు దౌర్జన్యం

శ్రీకాకుళం, 31 ఆగస్టు 2012 : నర్సన్నపేట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్‌, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు సతీమణి పద్మప్రియపై పోలీసులు దౌర్జన్యం చేశారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్‌ పిలుపులో భాగంగా శుక్రవారంనాడు శ్రీకాకుళంలో ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా ఈడ్చుకుపోయి వ్యాన్‌లో ఎక్కించారు. అడ్డుకోబోయిన కృష్ణదాసుతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో కృష్ణదాసు చేతి వేలికి గాయమైంది. గాయపడిన కృష్ణదాస్‌కు రిమ్సు ఆస్పత్రిలో చికిత్స చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై పద్మప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, పోలీసుల తీరుపై ధర్మాన కృష్ణదాసు తీవ్రంగా ప్రతిస్పందించారు. పోలీసుల అత్యుత్సాహంపై అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల వ్యవహారశైలిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌కు కృష్ణదాసు ఫిర్యాదు చేశారు. దురుసుగా వ్యవహరించిన గార ఎస̴్ఐ నారీమణిపై చర్యలు తీసుకోవాలని కలెక్యర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.

బంద్‌ సందర్భంగా పోలీసులు - వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సుమారు 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలంటూ వందలాది మంది పార్టీ శ్రేణులు పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళకు దిగారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కృష్ణదాసు సతీమణి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది.

Back to Top