ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమరణ దీక్ష

కోవూరు (నెల్లూరు జిల్లా) :

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా నియోజకవర్గంలోని మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరంలో కూర్చున్నారు. ఆమరణ దీక్ష ప్రారంభించడానికి ముందుగా ఆయన కోవూరు గ్రామదేవత నాగవరప్పమ్మ గుడి వద్ద పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకుని‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం‌ ప్రసన్న దీక్ష ప్రారంభించారు.

ఆమరణ దీక్ష చేస్తున్న ప్రసన్నకుమార్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు భారీసంఖ్యలో నాయకులు, ప్రజలు తరలి వచ్చారు. సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరుసిటీ నియోజకవర్గాల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పి.అనిల్‌ కుమార్‌‌ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత, నాయకులు రాధాకృష్ణారెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వేమిరెడ్డి వినిత్‌కుమార్‌రెడ్డి, మంచి శ్రీనివాసులు, అట్లూరి సుబ్రహ్మణ్యం, రూప్‌కుమార్ యాద‌వ్ పాల్గొన్నారు.

‌మరో పక్కన కోవూరు జేబీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం సాయంత్రం ర్యాలీగా వచ్చి  ప్రసన్న కుమా‌ర్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో విద్యార్థులు దీక్షా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

Back to Top