కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

  • విద్యను వ్యాపారం చేసిన ఘనుడు చంద్రబాబే
  • రెండున్నరేళ్లయినా ఇచ్చిన హామీ నెరవేరలేదు
  • ఇప్పటికైనా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలి
  • ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ 
నెల్లూరుః నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నాకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ద్వారక్ నాథ్ లు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు, రెండున్నరేళ్లు పూర్తయినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని మండిపడ్డారు. తమను క్రమబద్ధీకరించాలంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు 8 రోజులుగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దున్నపోతుపై వాన పడిన చందాన ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. 

ఇప్పటికే అనేకమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ తన కాలేజీలో ఇవే వేతనాలతో ఉద్యోగులను ఉంచారా..? సమాధానం చెప్పాలన్నారు. కాంట్రాక్ట్ లెక్టరర్ల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, విద్యను వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్ల న్యాయమైన కోరికకు తమ అధినేత వైయస్ జగన్ మద్దతు తెలిపారని..తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. ఇప్పటికనై సంబంధింత మంత్రి, అధికారులు సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. 
Back to Top