రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడుతాం

ఢిల్లీ
: పార్లమెంట్ లో ప్రత్యేకహోదా సహా అనేక అంశాలను లేవనెత్తుతామని
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో
వెంకయ్యనాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈసమావేశంలో
వైఎస్సార్సీపీ తరపున మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా
మాట్లాడిన ఆయన..ప్రభుత్వం ముందు నాలుగు అంశాలు ఉంచినట్టు తెలిపారు.

ఏపీకి
ప్రత్యేకహోదా, వరదల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని,
విభజన చట్టంలోని వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ఎంపీ లాడ్స్ నిధులు
పెంచాలని కోరామన్నారు. అందరూ రూ. 25 కోట్లకు పెంచాలని అడిగినట్లు చెప్పారు.
దేశంలోని అన్ని మతాలను గౌరవించాలని, మత అసహనంపై ఎవరు నోరు జారినా
వైఎస్సార్సీపీ ఖండిస్తుందని మేకపాటి తెలిపారు.

గత
20 రోజులుగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురియడం వల్ల పంటలు తీవ్రంగా
దెబ్బతిన్నాయని మేకపాటి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు తీవ్రంగా
నష్టపోయారన్నారు. అదేవిధంగా వరి, ఆకు, అరటి తోటలు లక్షల ఎకరాల్లో
దెబ్బతిన్నాయని చెప్పారు. కేంద్రం అన్నివిధాలుగా సహాయం చేయాలన్నారు.
ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని...తప్పనిసరిగా ఇచ్చిన హామీలకు
ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు
కాపాడేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ లో పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు.
Back to Top