మరో ప్రజాప్రస్థానానికి సర్వం సిద్ధం

హైదరాబాద్, 17 అక్టోబర్ 2012: వైయస్‌ కుమార్తె, జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టనున్న చరిత్రాత్మక పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. తొలుత వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ఉదయం 10 గంటలకు వైస్ ఘాట్ (సమాధి) వద్ద సర్వమత  ప్రార్థనల తర్వాత షర్మిల తన మరో ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. యాత్ర ప్రారంభ  కార్యక్రమంలో పాల్గొనేందుకు వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మతో పాటు పలువురు నేతలు హైదరాబాద్ నుండి ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు.
మొదట ఉదయం 11 గంటలకు ఇడుపులపాయ నుండి యాత్ర ప్రారంభమవుతుంది. నడకను ప్రారంభించిన తర్వాత పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయే వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాల విజయమ్మ కూడా తన కుమార్తె పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరిస్తూ ప్రసంగిస్తారు. ప్రసంగాల అనంతరం షర్మిల అక్కడికి దగ్గరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత తన పాదయాత్రను కొనసాగిస్తారు.
ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు మూడు వేల కిలోమీటర్ల దూరం పదహారు జిల్లాల మీదుగా సుదీర్ఘంగా ఆరునెలల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో షర్మిల కిరణ్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు, రిబ్బన్లను ధరిస్తారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలిన ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఈ యాత్ర సాగుతుంది. రాజన్నరాజ్యం మరెంతో దూరం లేదని ప్రజలకు భరోసా కల్పించడం ఈ యాత్ర ఉద్దేశ్యం. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతో పాటు ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ ఒత్తిడి తేవడం కూడా యాత్ర ఉద్దేశ్యం. నిజానికి అధికారపక్షం కాంగ్రెస్, ప్రతిపక్షమైన టిడిపి తెరవెనుక చీకటి పొత్తు కుదుర్చుకున్నాయనీ, అవి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కుమ్మక్కు అయ్యాయనీ ప్రజలకు చెప్పాలనీ వైయస్సార్ సీపీ నిర్ణయించింది. ఇదిలావుండగా ప్రజలు కడగండ్లను ఎదుర్కొంటున్నందున, ప్రధానంగా జనసామాన్యం కన్నీళ్లు తుడిచేందుకు మరో ప్రజాప్రస్థానం సాగుతున్నందున యాత్రలో ఎలాంటి ఆర్భాటాలూ వద్దని, పూలు చల్లడం, బాణసంచా కాల్చడం వంటివి వద్దనీ పార్టీ విజ్ఞప్తి చేసింది. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా 18న వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పలువురు ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. 
పాదయాత్ర ఇడుపులపాయ నుండి మొదలై మొదట 4.5 కిలోమీటర్లు సాగి వీరన్నగట్టుపల్లె చేరుకుంటుంది. అక్కడి నుండి వీరన్నగట్టుపల్లె 1.5 కి.మీ.లు నడచి కుమ్మరాంపల్లె దాకా సాగుతుంది. కుమ్మరాంపల్లె నుండి వేంపల్లె నుండి నాలుగు రోడ్ల కూడలికి 5.0. కి.మీలు నడచి షర్మిల అక్కడ సాయంత్రం 4.30గంటలకు జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. వేంపల్లె నాలుగురోడ్ల కూడలి నుండి రాజీవ్ నగర్ కాలనీ (2.0.కి.మీ.) వరకు పాదయాత్ర చేసి రాత్రికి బస చేస్తారు. తొలి రోజు 15 కిలోమీటర్ల యాత్ర ఉంటుందని పాదయాత్ర సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ చెప్పారు. షర్మిల బస కోసం రోడ్డు పక్కనే గుడారాలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రెండవరోజు రాజీవ్ నగర్ కాలనీ నుండి నందిపల్లె వరకు (3.5 కి.మీ.), నందిపల్లె నుండి తాళ్లపల్లె (1.8 కి.మీ) తాళ్లపల్లె నుండి దుగ్గన్నపల్లె (1.2 కి.మీ.), దుగ్గన్నపల్లె నుండి అమ్మయ్యగారి పల్లె (1.5 కి.మీ), అమ్మయ్యగారి పల్లె నుండి చాగలేరు క్రాస్ (1.2 కి.మీ), అక్కడి నుండి వి.కొత్తపల్లె (0.6 కి.మీ), వి.కొత్తపల్లె నుండి గొందిపల్లె క్రాస్ (3.0 కి.మీ), గొందిపల్లె క్రాస్ నుండి వేముల (1.5 కి.మీ), వేముల నుండి భూమయ్యగారిపల్లె క్రాస్ (4.7 కి.మీ) వరకు యాత్ర సాగుతుంది. అక్కడ రెండవరోజు రాత్రి బస చేస్తారు.
ఇక మూడవరోజు - భూమయ్యగారి పల్లె క్రాస్ నుండి వేల్పుల వరకు (1.0 కి.మీ), వేల్పుల నుండి బెస్తవారిపల్లె (2.8 కి.మీ), బెస్తవారిపల్లె నుండి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ (5.0 కి.మీ), పులివెందుల ఆర్టీలీ బస్టాండ్ నుండి పార్నపల్లె రోడ్డు రింగ్‌ సర్కిల్‌ శ్రీ వైయస్సార్‌ స్వగృహం (2.5 కి.మీ) పాదయాత్ర సాగనుంది. రాత్రికి బస.
నాలుగవ రోజు -పులివెందుల రింగ్‌రోడ్‌ నుండి చిన్నరంగాపురం వరకు (2.6 కి.మీ), చిన్నరంగాపురం నుండి ఇప్పట్ల (3.8 కి.మీ), ఇప్పట్ల నుండి చిన్న కుడాల క్రాస్‌ (1.0 కి.మీ), చిన్నకుడాల క్రాస్‌ నుండి పెద్దకుడాల క్రాస్‌ (1.0 కి.మీ)
పెద్దకుడాల క్రాస్‌ నుండి లింగాల (4.6 కి.మీ), లింగాల నుండి లోపట్నూతల క్రాస్ (2.0 కి.మీ) వరకు పాదయాత్ర కొనసాగుతుంది. లోపట్నూతలక్రాస్‌ వద్ద నాలుగవ రోజు విశ్రాంతి.
ఐదవరోజు - లోపట్నూతల క్రాస్‌ నుండి కర్ణపాపయ పల్లి వరకు (4.4 కి.మీ), కర్ణపాపయ పల్లి నుండి వెలిదండ్ల (3.6 కి.మీ), వెలిదండ్ల నుండి వేర్జాం పల్లె (4.8 కి.మీ), నేర్జాంపల్లె నుండి పార్నపల్లె (4.0 కి.మీ) వరకు పాదయాత్ర ఉంటుంది.  ఐదవ రోజు రాత్రి విశ్రాంతి.
ఆరో రోజు నుంచి సాగే యాత్ర వివరాలను పార్టీ తర్వాత విడుదల చేస్తుంది.
పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు మంగళవారం యాత్ర సాగే మార్గంలో ఇడుపులపాయ నుంచి వేంపల్లె, వేముల, పులివెందుల, లింగాల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకు పర్యటించి షర్మిల రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వై.ఎస్.అవినాశ్‌ రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌ఛార్జి వై.ఎస్.కొండారెడ్డిలతోపాటు పలువురు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రూట్‌ పరిశీలన చేశారు. రాత్రి బస చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లపై చర్చించారు. అలాగే ఇడుపులపాయకు భారీగా జనం హాజకు కానున్న నేపథ్యంలో అక్కడ బారికేడింగ్ తదితర అంశాలపై కూడా సమీక్షించారు. ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కూడా భేటీ అయి పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఇదిలావుండగా, ఈ నెల 23న తేదీన పార్నపల్లె వద్ద షర్మిల మధ్యాహ్న భోజన అనంతరం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తారని సమన్వయ కమిటీ సభ్యులు దేవిరెడ్డి శివశింకర్‌రెడ్డి తెలిపారు.

షర్మిల రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు -

దివంగత మహానేత వైఎస్ కుమార్తె తమ గ్రామాలకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఆమె కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షర్మిలకు అభిమానంతో ఘన స్వాగతం పలికేందుకు జనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైయస్‌ సంక్షేమరాజ్యం మరెంతో దూరం లేదని ప్రజలకు భరోసా కల్పించేందుకు సాగుతున్న ఈ యాత్ర వైయస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ నింపుతుందని భావిస్తున్నారు. మహానేత వైయస్ఆర్ అడుగుజాడల్లోనే తొమ్మిదేళ్ల తర్వాత ఆయన కుమార్తె షర్మిల ప్రజల్లోకి వెళ్లనుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రలు పన్ని వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని జనం మధ్య లేకుండా చేయడంతో, ప్రజల పక్షాన పోరాడేందుకు అన్న తరఫున, అన్న ఆదేశాల మేరకు షర్మిల ఈ యాత్ర తలపెట్టారు. ఇటీవలి ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పక్షాన తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల అందర్నీ ఆకట్టుకున్నారు. ‘మీ రాజన్న కూతుర్ని... జగనన్న చెల్లెల్ని.. నా పేరు షర్మిల’ అంటూ ఉప ఎన్నికల ప్రచారంలో తనను తాను పరిచయం చేసుకున్న షర్మిల,  ఎన్నికల ప్రచారంలో లక్షలాది మంది అభిమానాన్నిచూరగొన్నారు. నాటి ఆమె ప్రచారం పార్టీ విజయానికి ఎంతో దోహదం చేసింది.


.

తాజా వీడియోలు

Back to Top