మరో ప్రజా ప్రస్థానం చారిత్రాత్మకం: రోజా

వేల్పుల:

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైయస్ఆర్ ఎలా నడిచారో అప్పట్లో తనకు  అర్థం కాలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా చెప్పారు. శనివారం కడప జిల్లా వేల్పులలో ఆమె మాట్లాడారు. ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన మహాప్రస్థానంలో వెల్లడవుతున్న ప్రజల అభిమానం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని తెలిపారు. ప్రజాభిమానంతో ఎలాంటి కష్టన్నయినా అధిగమించవచ్చని రుజువైందన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారన్నారు. ఎదుర్కోని సమస్య లేదన్నారు. కరెంటు లేకపోవడం సాధారణమైందన్నారు. సర్చార్జి విధింపు అన్ని వర్గాలకు అశనిపాతమైంది. ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎందుకు న్యాయం చేయడంలేదో తెలీడం లేదన్నారు. ప్రజల కష్టాలు తీర్చడంలో వైయస్ఆర్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. వేల కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడిన షర్మిల దీనికి ఉదాహరణని రోజా పేర్కొన్నారు.   ఓ సాహస కార్యానికి పూనుకున్న షర్మిలను కొందరు రాజకీయ పార్టీల నేతలు తక్కువ చేసి మాట్లాడడం తగదని ఆమె హితవు పలికారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం చారిత్రాత్మకమని ఆమె కితాబునిచ్చారు.

Back to Top