మంత్రి కె.పి. సారధి రాజీనామా చేయాలి

విజయవాడ: రాష్ట్ర మాథ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. విజయవాడ మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని  న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసి విచారణకు హాజరు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచిన సారథి మంత్రి పదవిలో కొనసాగేందుకు అనర్హుడన్నారు. సత్యప్రమాణికంగా పదవీప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అసత్య అఫడవిట్లు దాఖలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అవినీతిమంత్రులను, అధికార పార్టీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతూ వస్తోందని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి సారథిని వెంటనే బర్తరఫ్ చేసి సచ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

దిగజారుడు మంత్రీ.. దిగిపో.. : పడమట
కంకిపాడు : నీచమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న మంత్రి సారథి పదవి నుంచి దిగిపోవాలని వైయస్ఆర్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు డిమాండ్ చేశారు. కంకిపాడులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసిందన్నారు. అధికార బలంతో సారథి తన తప్పులను కప్పి పుచ్చుకుంటూ చట్టాలను బేఖాతరు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీఎం, గవర్నర్ స్పందించి సారథిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సారథిపై చర్యలకు జాప్యం చేస్తే పార్టీ ఆధ్వర్యంలో ప్రజాందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మండల పార్టీ కన్వీనర్ మాదు వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.

పదవి కోసమే ‘బాబు’ యాత్ర
జమ్మికుంట: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం పాదయాత్ర ప్రజల కోసం కాదని, పదవి కోసమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుట్ట మధు విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో  దగ్గర ఆయన విలేకరులతో మా ట్లాడారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం గుర్తు రాలేదని, మళ్లీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు పాదయాత్ర పేరుతో మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఆయన హయాంలో కరెంట్ చార్జీలు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేపడితే పోలీసులతో కాల్పులు జరిపించారని, మహిళలు సారా నిషేధించాలని కోరితే ఊరూరా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వ విధానాలను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంతో ములాఖత్ అయ్యారని, అందుకే ప్రజల పక్షాన మాట్లాడడం లేదని ఆరోపించారు. లిక్కర్‌తో యాత్ర సాగిస్తున్నారని, ఆయన యా త్రలో దొరికిన లిక్కరే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆయన ఎన్నియాత్రలు చేసినా జనం నమ్మరని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top