మహానేత పాలనలో గ్యాస్ ధర పెరగలేదు

ఇబ్రహీంపట్నం:

చంద్రబాబునాడయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వంట గ్యాస్ ధర రూ.145 నుంచి రూ.305కి పెరిగిందనీ,  డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా పెరగలేదనీ దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్  షర్మిల పేర్కొన్నారు. డాక్టర్ వైయస్ జనం నుంచి దూరమయ్యాక ఇప్పటి ప్రభుత్వం రూ.305 నుంచి రూ.460కి గ్యాస్ ధర పెంచిందని దుయ్యబట్టారు. ఆరు సిలిండర్లు దాటితే ఒక్కో సిలిండర్‌కు రూ.1,000 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ‘చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోయారనీ, డాక్టర్ వైయస్ సీఎం కాగానే రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చే బిల్లుపై తొలి సంతకం చేశారనీ చెప్పారు. గృహావసరాల కరెంటు చార్జీలు పెంచబోమని ఇచ్చి ఐదేళ్లపాటు అలాగే ఉన్నారన్నారు. ఆయన తదుపరి వచ్చిన నేతలు కరెంటు చార్జీలను ఇష్టానుసారం పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవచ్ఛవాల్లా తయారయ్యారనీ, మహానేత అధికారంలోకి రాగానే రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేసి, రైతన్నను అప్పుల ఊబి నుంచి బయట పడేశారరనీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే రైతును మళ్లీ అప్పుల ఊబిలోకి తోసేసిందన్నారు. ఏ రకంగా చూసుకున్నా నాటి చంద్రబాబు పాలనకూ, నేటి కాంగ్రెస్ పాలనకూ కొంచెం కూడా తేడా లేదన్నారు. జనం నెత్తిన పన్నుల భారం మోపడంలోను, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేయడంలోనూ రెండూ రెండేనని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా డాక్టర్ వైయస్ఆర్ పాలనలో ఒక్క పైసా కూడా ప్రజలపై భారం వేయలేదని చెప్పారు. వైయస్ పథకాలకు ఒకవైపు తిలోదకాలు ఇస్తూ.. మరోవైపు జనం నెత్తిన అదనపు పన్నుల భారం మోపుతున్నారన్నారు.

Back to Top