హైదరాబాద్, 31 సెప్టెంబర్: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కంటే తామే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైయస్ఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తే తాను రూపాయికే ఇస్తున్నాననీ, వడ్డీ లేకుండా మహిళలకు రుణాలిస్తున్నాననీ ముఖ్యమంత్రి చెప్పడం శోచనీయమన్నారు. విద్యుత్తు చార్జీలను 15వేల కోట్లు పెంచిన విషయాన్ని, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తగ్గించిన అంశాన్నీ, 104, 108 సర్వీసులను నిర్వీర్యం చేస్తున్న అంశాన్నీ, మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచిన విషయాన్నీ, ఫీజు రీయింబర్సుమెంటు పథక లక్ష్యాన్ని ఏరకంగా తగ్గిస్తున్నదీ ఎందుకు చెప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
షర్మిల యాత్రపై విమర్శలా...
ఓ పక్క చంద్రబాబు, మరో పక్క షర్మిల పాదయాత్ర చేస్తుండడంతో ముఖ్యమంత్రి దిక్కు తోచని స్థితిలో పడ్డారనీ, ఇందిరమ్మ బాట పేరుతో గ్రామాల్లో తిరుగుతూ ఈ రకంగా మాట్లాడుతున్నారనీ జూపూడి వివరించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ వెంట ప్రజాప్రస్థానంలో అడుగులో అడుగేసిన కిరణ్‌కుమార్ రెడ్డి ఏ నోటితో షర్మిల పాదయాత్రను ప్రశ్నిస్తున్నారని అడిగారు. ఇలా మాట్లాడితే మీకింకా మెచ్యూరిటీ రాలేదని ప్రజలు భావిస్తారని హెచ్చరించారు.పార్టీల నాటకాలకు ప్రజలు తెరదించారు
బాబు, కిరణ్ వైఖరిపై ఏవగింపు
రాష్ట్రంలో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కేందుకు ఆడిన నాటకానికి ప్రజలు ఉప ఎన్నికలలో తెరదించారని జూపూడి చెప్పారు. జగన్ ఎక్కడ బెయిలుపై వస్తారోననే ఆందోళనతో విచారణకు ముందు రోజు తెలుగుదేశం ఏ రకంగా ప్రయత్నించిందీ అందరికీ తెలుసున్నారు. పాదయాత్ర చేస్తే కానీ అధికారంలోకి రాలేనని భావించిన చంద్రబాబు దానిని దాచుకోడానికి ప్రజా సమస్యలకోసం యాత్ర చేస్తున్నానని చెప్పుకుంటున్నారని తెలిపారు. తమ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే తెలుగుదేశం నేతలు ఆయనను కాకుండా జైలులో ఉన్న జగన్‌ను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. మీ నాయకుడి మీద నమ్మకం ఉంటే ఇటెందుకు వస్తున్నారని ఆయన అడిగారు. చంద్రబాబు, కిరణ్ మాట్లాడుతున్న వైఖరి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఇచ్ఛాపురం దాకా వెళ్ళడం అనుమానమేనన్నారు. ఉత్తరాంధ్ర వెళ్ళేలోపు టీడీపీ నాయకులంతా వైయస్ఆర్ కాంగ్రెస్‌లో కలిసిపోతారనీ, అప్పుడు చంద్రబాబు కలవడానికి వచ్చేవారెవరూ ఉండరనీ పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీ నాయకులను తన పార్టీలో కలుపుకోడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుగు దేశం పార్టీకి చెందిన పెద్దపెద్ద నేతలు అంటున్నారన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తారనే నమ్మకం చంద్రబాబుపై ఉంటే వారు జగన్‌ను ఎందుకు కలుస్తారనీ ఆ నేతలను అడుగుతున్నానన్నారు. 'నిజం చెప్పక పోవడం.. పొరపాటున అధికారంలోకి వస్తే చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడమనే' లక్షణాలు చంద్రబాబుకు పుట్టుకతో అబ్బాయని జూపూడి ధ్వజమెత్తారు.
చంద్రబాబును నమ్మేదెవరు..!
రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని అంటున్న చంద్రబాబే తన హయాంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను తుచ తప్పకుండా ఆచరించిన విషయం తెలీదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఓ పక్కన ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తావని ముఖ్యమంత్రి కూడా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారన్నారు. బ్యాంకు రుణాలు ఎలా మాఫీ చేస్తావని కిరణ్ అడుగుతుండడం కూడా వారి మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. బాబు ఇస్తున్న వాగ్దానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ వెంటే ప్రజలు ప్రయాణిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే నాయకుడు, ఆయనే అభివృద్ధి పథంలో నడిపిస్తారని భావించే ఆయనను కలుస్తున్నారన్నారు. జగన్ మాత్రమే రాష్ట్రానికి అవసరమనీ, ఆయనే దిక్కనీ ప్రజలు భావిస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు ఆపేయాలని కోరుతున్నారన్నారు. అధికార దాహంతో చేసే విమర్శలు తగ్గించుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు యాత్ర ముగిసేలోగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయం మూతబడుతుందని జూపూడి జోస్యం చెప్పారు. జగన్‌ని కలవకుండా మీ నాయకుల్ని కట్టడి చేసుకోండి కానీ, షర్మిల పాదయాత్రపై విమర్శలు తగదని ఆయన హితవు పలికారు. జగన్ మీద, ఆయన కుటుంబం మీద ఎటువంటి విమర్శలూ వద్దన్నారు. జగన్‌ను జైలులో పెట్టేంతవరకూ నిద్రపోని నాయకులు , బెయిలుపై రాకుండా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు పన్నుతున్నాయన్నారు. నేతల వలసలను ఆపలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల నాటకాలకు ప్రజలు త్వరలో తెర దింపబోతున్నారన్నారు.
సెల్‌ఫోన్ ఆరోపణకు కట్టిబడి ఉన్నారా!
జగన్ జైలులో సెల్ ఫోన్ వాడుతున్నారన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా.. ఉంటే ఆయన భార్య శ్రీమతి వైయస్ భారతి ఛాలెంజ్‌ని స్వీకరించాలని జూపూడి సవాలు చేశారు. తెలుగు దేశం రాజకీయాల మీద, విలువల మీద నమ్మకముంటే సవాలును అంగీకరించాలని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్ బయటికి వస్తే తమ ఆఫీసులు మూసుకోవాల్సి వస్తుందనే భయంతో నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రాజశేఖరరెడ్డి ఆశయాలు ఫలించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు.
జగన్ బాణం తుత్తునియలు చేస్తుంది
అధికారంలోకి వచ్చే అవకాశం లేని కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు తమలో తాము ఎన్నయినా మాట్లాడుకోవచ్చు గానీ, తమ పార్టీపై విమర్శలు చేసే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. మీ పని మీరు చేసుకోకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురి చూడాలనుకుంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం మిమ్మల్ని తుత్తునియలు చేస్తుందని చెప్పారు. జగన్ గురించి, ఆయన ఆశయాల గురించి అర్థం చేసుకున్న నాయకులు తమ పార్టీవైపు వస్తున్నారని అర్థం చేసుకోవాలని కోరారు. లేకపోతే మీ పార్టీ ఆఫీసులకు టు- లెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తమకు అవకాశముంటే ఎప్పుడో అవిశ్వాసం ఎప్పుడో పెట్టే వాళ్ళమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పాదయాత్రలు చేయడం మాని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని చంద్రబాబును ఆయన డిమాండు చేశారు. జైలులో ఎవరు జగన్మోహన్ రెడ్డిని కలిసినా అది నమోదవుతుందనీ, దానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనీ ఆయన యనమలకు సూచించారు. ఎందుకంటే జగన్‌ను కలిసిన వారంతా బయటకొచ్చి మిమ్మల్ని తిట్లు తిడుతున్న వైనం అందరూ చూస్తూనే ఉన్నారని జూపూడి చెప్పారు. తెలంగాణ అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ చాలా స్పష్టమైన వైఖరితో ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.