'మాట నెరవేర్చేందుకు పుట్టిందే వైయస్‌ఆర్‌సిపి'

వరంగల్‌ : ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పుట్టినదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సిపి కృషి చేస్తున్నదని ఆమె అన్నారు. వరంగల్‌లోని అన్నపూర్ణేశ్వరి గార్డెన్‌లో శుక్రవారంనాడు పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివా‌స్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొండా సురేఖ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం సభ్యత్వ నమోదు, అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరును నాయకులు, కార్యకర్తలకు వివరించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సుస్థిర పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం ‌రావాలని సూచించారు. పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. సభ్యత్వ నమోదులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందరూ కష్టపడితే భవిష్యత్తు వైయస్‌ఆర్‌సిపిదేనని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం మండలాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు.

పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి :
టిడిపి మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య కొండా దంపతుల ఆహ్వానం మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనను కొండా దంపతులు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. రాజయ్యతో పాటు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సురేఖ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, టిడిపిలో అణచివేత ధోరణి అధికంగా ఉందన్నారు. ఆ ధోరణితో విసిగిపోయిన తాను శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్‌ఆర్‌సిపిలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ టి.రమే‌ష్‌బాబు, కె.కె. మహేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రాము, మదన్‌లాల్, బండి పుల్లయ్య, భీంరెడ్డి సుధీ‌ర్‌రెడ్డి, నూనావత్ రాధ‌, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top