వైయస్ జగన్‌ చొరవతో కూలీకి ప్లాస్టిక్‌ సర్జరీ

నంద్యాల: గ్యాస్‌ లీకేజ్‌తో గాయపడ్డ వ్యవసాయ కూలీ పెద్దకాశీంకు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ప్లాస్టిక్‌ సర్జరీ జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని మెడికేర్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైద్యుల బృందం గురువారం ఆయనకు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. బండిఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామానికి చెందిన పెద్దకాశీం వ్యవసాయ కూలీ. గత జూలై 24న ఇంట్లో గ్యాస్‌ లీకై చేతులు, ముఖం, వీపునకు కాలిన గాయాలయ్యాయి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా పూర్తిగా కోలుకోలేదు. ఈనెల 9న రైతు భరోసా యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బి.కోడూరు గ్రామంలో పర్యటించారు.

ఆ సందర్భంగా ఆయనను పెద్దకాశీం కలిసి అవేదనతో తన దుస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన జగన్‌ అక్కడే ఉన్న పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి సోదరుడు డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డికి తగిన వైద్యం చేయించాలని సూచించారు. ఆ మేరకు కాశీంను నంద్యాలలోని మెడికేర్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు హైదరాబాద్‌లోని ప్రైమ్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ అనురాగ్, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, అనెస్తీషియా స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి గురువారం రెండు గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. దీనికి రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని, జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు సర్జరీని ఉచితంగా చేసి మందులను కూడా అందజేశామని డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
Back to Top