కుమ్మక్కు అయింది మీరు బాబూ!

మద్దికెర

8 నవంబర్ 2012 : కాంగ్రెస్‌తో జగన్‌ కుమ్మక్కు అయ్యారన్న టిడిపి ఆరోపణలపై షర్మిల మండిపడ్డారు. నిజంగానే కుమ్మక్కు అవ్వాలనుకుంటే జగనన్నకు ఇన్ని కష్టాలు వచ్చేవే కావని ఆమె అన్నారు. కుమ్మక్కు అవాలనుకుంటే జగనన్న ఈ పాటికి కేంద్రమంత్రి అయ్యుండేవాడని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయి వుండేవాడేమోననీ షర్మిల వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా మద్దెకెరలో గురువారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో మాట్లాడుతూ షర్మిల టిడిపి ఆరోపణలకు ఘాటుగా, దీటుగా సమాధాన మిచ్చారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయినందునే ఇటీవల విజయమ్మ, వైయస్.భారతి ఢిల్లీకి వెళ్లారన్న టిడిపి ఆరోపణలను ప్రస్తావిస్తూ "అసలు మీరు మనుషులేనా?" అని ఆమె ప్రశ్నించారు.
షర్మిల మాటల్లోనే...
"తెలుగుదేశం వాళ్లు అంటారు, జగనన్న కాంగ్రెస్‌తో కుమ్మక్క య్యారట. అందుకనే అమ్మ, వదిన ఢిల్లీకి వెళ్లారట. మేము అడుగుతున్నాం, అసలు మీరు మనుషులేనా? మా లాయర్లు కూడా ఢిల్లీలోనే ఉంటారు. వాళ్లని కలవడానికి వెళ్లకూడదా? అసలు కుమ్మక్కు అవ్వాలనే జగనన్న అనుకుంటే ఇన్ని కష్టాలు జగనన్నకు వచ్చేవా అని మేం అడుగుతున్నాం. అసలు కుమ్మక్కు అవాలనే జగనన్న అనుకుని ఉంటే ఈ పాటికి కేంద్రంలో ఏ మంత్రో అయ్యేవాడు. లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడేమో! కుమ్మక్కు అవుతున్నది మీరు చంద్రబాబునాయుడుగారూ! కుమ్మక్కు అయ్యారు కనుకనే చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలున్నా కాంగ్రెస్‌వాళ్లు విచారణ జరపరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టరు. ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ, ఎప్పుడు చూసినా వెన్నుపోట్లతో అబద్ధాలతో పబ్బం గడుపుకునే వీరు జగనన్నను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు." అని షర్మిల దుయ్యబట్టారు.
రైతు కంటతడి పెడుతుంటే వేడుక చూస్తున్న ప్రభుత్వం!
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఆమె తీవ్రంగా విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన ఒక రైతు టొమాటోలను పారబోసుకున్నాడని ఆమె చెప్పారు. కష్టపడి, ఖర్చు పెట్టుకుని పండించిన టొమాటోలను కేజీ ఒక రూపాయకు అడుగుతున్నారనీ,  ఆ మాత్రానికి అమ్ముకోవడమెందుకని ఇలా పారబోసానంటూ ఆ రైతు వాపోయాడని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూసి మనసుకి చాలా కష్టమనిపించిందనీ, రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికి ఉంటే ఆ రైతుకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆమె అన్నారు. వైయస్‌కు రైతన్నఅంటే చాలా ప్రీతి అనీ, రైతన్నకు పెద్దపీట వేసి అన్నివిధాలుగానూ ఆదుకోవా లనుకున్నాడని ఆమె గుర్తు చేశారు. దేనికీ కొరత లేకుండా నీళ్లు, కరెంటు, ఇన్‌పుట్‌ సబ్సిడీలను అందించారని ఆమె అన్నారు. దురదృష్టవశాత్తు పంట పోతే గ్రామం యూనిట్‌గా పంటల బీమా ఇచ్చారని ఆమె చెప్పారు. అలాగే మహిళలంటే కూడా రాజశేఖర్ రెడ్డి చాలా ఇష్టమనీ, తన అక్కచెల్లెళ్లను ప్రతి ఒక్కరినీ లక్షాధికారిని చేయాలని తపించారన్నారు. ఇందిరమ్మ ఇళ్లను వారి పేర్లపైనే పెట్టారనీ ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ అమలు చేశారనీ, పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీని అమలు చేశారనీ ఆమె చెప్పారు. ఇలా రాజశేఖర్ రెడ్డిగారు చెప్పినవీ, చెప్పనివీ ఎన్నోచేశారనీ. అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి మనసు లేదని ఆమె విమర్శించారు. వైయస్‌ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ప్రతి మాటకూ తూట్లు పొడుస్తోందన్నారు. రైతన్న సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, అన్నదాత కంటతడి పెడుతుంటే వేడుక చూస్తోందని ఆమె
ఆవేదనగా అన్నారు. అన్నిధరలూ చార్జీలూ పెరిగి మహిళలు అల్లాడుతున్నారనీ, విద్యార్థులకు భిక్షమిచ్చినట్లు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నారనీ షర్మిల విమర్శించారు.
ఏవీ !ఎక్కడ ఆ 15 లక్షల ఉద్యోగాలు?!
కిరణ్ కుమార్ రెడ్డి 15 లక్షల ఉద్యోగాలిస్తామన్నారనీ, కానీ అందులో కనీసం 10 శాతమైనా ఇచ్చారో లేదో చెప్పమంటే చెప్పరనీ ఆమె ఎత్తిపొడిచారు. మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామంటున్నా, వాస్తవానికి రెండు రూపాయల వడ్డీ పడుతోందని ఆమె చెప్పారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉంటే తొమ్మిది గంటల కరెంటు వచ్చి ఉండేదనీ, 30 కేజీల బియ్యం వచ్చేదనీ ఆమె అన్నారు. రూపాయికి బియ్యం ఇస్తూ మిగతావేవీ ఇవ్వకుండా, గ్యాస్ ధరను కూడా అమాంతం పెంచేసి మహిళల బ్రతుకలను దుర్భరం చేసేశారని ఆమె విమర్శించారు. ఇచ్చే రెండు గంటల కరెంటుకు సర్-చార్జీలు కూడా వసూలు చేస్తున్నారని షర్మిల ఎగతాళి చేశారు. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 305 ఉండేదనీ,  అప్పట్లో గ్యాస్‌, ఆర్టీసీ చార్జీలతో సహా వేటినీ వైయస్ ఒక్క రూపాయి కూడా పెంచలేదనీ ఆమె గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు 6 వేల కోట్ల పెట్టుబడులు తెస్తామన్నారనీ, కానీ రూ. 60 కోట్లు కూడా తేలేకపోయారనీ ఆమె విమర్శించారు.
"ఉద్యోగాలు లేవు. రైతులు కంటతడి పెడుతున్నారు. మహిళలు ఏడుస్తున్నారు. పిల్లలు బాధపడుతున్నారు. ప్రభుత్వా న్నినిలదీయాల్సివ చంద్రబాబు మూడేళ్లుగా తన బాధ్యతను విస్మరించారు" అని షర్మిల ఆక్షేపించారు.
ఏ మొహం పెట్టుకుని చెపుతున్నారు బాబూ!
తన హయాంలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారనీ, బకాయీలు కట్టమంటూ ఒత్తిడి తెచ్చి జైలు పాలు కూడా చేశారనీ, ఏకంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆమె చెప్పారు. అప్పుడు అలా వేధించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బకాయిలు చెల్లించవద్దంటున్నారని ఆమె అవహేళన చేశారు. ఒక్కప్పుడు గ్రామాలను శ్మశానాలుగా మార్చిన బాబు ఇప్పుడు ఆ గ్రామాలకు వెళ్లి కాళ్లూ చేతులూ పట్టుకున్నాఆనాటి పాపం పోదని ఆమె దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి బాబు ఏ మేలూ చేయలేదన్నారు. 'అవిశ్వాసం' పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్నిదించేసే వీలున్నా చంద్రబాబు దీనిని పెంచి పోషిస్తున్నారన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత అంటే ఎన్నటికీ అర్థం కాదన్నారు. జగన్‌పై కాంగ్రెస్, టిడిపి కలిసి అబద్ధపు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు.
షర్మిల సభతో మద్దికెర జనసంద్రమైంది. గురువారం మద్దికెర నుండి పాదయాత్ర ప్రారంభమౌతుంది.

తాజా వీడియోలు

Back to Top