చేబ్రోలు (గుంటూరు జిల్లా), 17 మార్చి 2013 : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమించరాని ద్రోహం చేశారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. విప్ ధిక్కరించిన 15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్, టిడిపిలకు ఉందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తే వేటు పడిన ఎమ్మెల్యేలంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికవుతారన్న భయం టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు పట్టుకుందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 93వ రోజు ఆదివారంనాడు ఆమె గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలులో నిర్వహించిన భారీ బహిరంగసభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మన ముందు నుంచి వెళ్ళిపోయి మూడున్నరేళ్ళయిందని, ఆ రోజు నుంచీ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఒక్క మహానేత మనకు దూరం అవడంతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందన్నారు. రాజశేఖరరెడ్డి మరణించే వరకూ రాజులా బతికిన రైతు ఇప్పుడు కరెంటు లేక, పంటలు లేక, మద్దతు ధర లేక, ఎరువుల ధరలు మూడింతలు పెరిగిపోవడంతో అల్లాడిపోతున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఏ పంట వేసినా నష్టమే వస్తోందని, అప్పులపాలైపోయామని బాధపడుతున్నారన్నారు.
చదువుకోవాలని ఎంత ఆశగా ఉన్నా, చదివించే స్తోమతు వారి తల్లిదండ్రులకు లేకపోవడంతో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని మహానేత రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోందన్నారు. పరిశ్రమలకు నెలకు 15 రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఇక రాష్ట్రంలో అవి ఎలా మనుగడ సాగిస్తాయని, లక్షలాది కార్మికులకు ఉపాధి ఎక్కడ దొరుకుతుందని శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని వర్గాల ప్రజలకు మహానేత రాజన్న లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేశారని ఆమె ప్రస్తావించారు.
కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన టిడిపి :ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, ఈ దుర్మార్గపు పాలన వద్దని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నా, పాదయాత్రలో చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్నా దీన్ని దించేయడంలేదు సరికదా చేదోడుగా నిలుస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల తరఫున కాకుండా పాలకపక్షంతో చేరి అమ్ముడుపోయారని నిరూపించుకున్నారని దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నదంటే ఆ పాపం చంద్రబాబు నాయుడిదే అని ఆమె నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజూ విమర్శలు, ఆరోపణలూ చేస్తున్న చంద్రబాబు అవిశ్వాసం వచ్చేసరికి ప్రభుత్వాన్నే కాపాడారని, ఇలాంటి వ్యక్తిని నాయకుడంటారా? ఊసరవెల్లి అంటారా? అని శ్రీమతి షర్మిల అన్నారు. ఒకప్పుడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు.
బాబు, కిరణ్ జనం నుంచి వచ్చిన నాయకులు కాదు :మామ నుంచి చంద్రబాబు సిఎం పదవిని లాక్కుంటే, కిరణ్ కుమార్ రెడ్డి సీల్డు కవర్ సిఎం అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. వీళ్ళిద్దరూ ప్రజల నుంచి పుట్టిన నాయకులు కాదన్నారు. వీరికి ప్రజల బాగోగులు ఏనాడూ పట్టలేదన్నారు. ఎన్నికలు వస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దు, చంద్రబాబూ వద్దు.. ముఖ్యమంత్రిగా తమకు జగనన్న కావాలంటూ రాష్ట్ర ప్రజలంతా తీర్పు ఇస్తారని వారికి భయం అన్నారు.
కాంగ్రెస్‌తో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని టిడిపి ఆరోపణలు చేస్తోందని.. ఒకవేళ కుమ్మక్కైతే జగనన్న ఇవాళ జైల్లో ఉండేవారు కాదని శ్రీమతి షర్మిల అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన పార్టీ ఉందంటే.. అది టిడిపియేనని విమర్శించారు. రాష్ట్రంలో మూడవ పార్టీ ఉండకూడదని కాంగ్రెస్ - టిడిపి కుట్ర పన్నాయని మండిపడ్డారు.
జనసంద్రంలా మారిన షర్మిల బహిరంగసభ :మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో శ్రీమతి షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమె ప్రసంగించిన వేదిక ప్రాంతమంతా జనసంద్రంగా కనిపించింది. చేబ్రోలు సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కాగా, ఆదివారంనాడు 93వ రోజు మరో ప్రజాప్రస్థానం ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 1,279.7 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చేబ్రోలు శివారులో ఏర్పాటు చేసిన బసకు ఆమె చేరుకున్నారు.