కోటకదిరలో పాదయాత్రకు సన్నాహాలు

మహబూబ్‌నగర్ 3 డిసెంబర్ 2012 : సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కోటకదిరలోకి ప్రవేశించనున్న శ్రీమతి షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం పలికేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. పాదయాత్ర ఏర్పాట్లలో భాగంగా వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎం.సురేందర్‌రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ టౌన్, రూరల్, హన్వాడ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షర్మిలతో మూడురోజుల పాటు రెండు వేల మంది వలంటీర్లు పాదయాత్రను అనుసరిస్తారని తెలిపారు.
4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక క్లాక్‌టవర్ వద్ద జరిగే బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి 50వేల మంది వరకు జనం తరలివస్తారని ఆయన వివరించారు. షర్మిలను స్వయంగా కలిసి తమ కష్టసుఖాలను చెప్పుకోవడానికి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. యువనేత వైయస్.జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ నేతలు వేధిస్తున్న, సాధిస్తున్న తీరు పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఆర్.రవిప్రకాశ్, పార్టీ మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల కన్వీనర్లు కోడూరు రాములన్న, సి.వెంకట్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకట్‌రెడ్డి, రిటైర్డు ఎస్‌ఐ ఫకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top