రైతుల నోట్లో మన్నుకొడుతున్నారు

టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది
హైటెక్ పోకడలు మాని రైతుల గురించి ఆలోచించాలి
తక్షణమే వడ్డీతో సహా రుణాలన్నీ మాఫీ చేయాలి
రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారిని ఆదుకోవాలి

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు చంద్రగ్రహణం పట్టినట్లు అనిపిస్తోందని తెలంగాణ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, వారి నోట్లో మట్టి కొడుతోందని రాఘవరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా హైటెక్ పోకడలు మాని రైతులపై శ్రద్ధ పెట్టాలని టీఆర్ఎస్ కు సూచించారు. ఎంతసేపు హైదరాబాద్ చుట్టూ తిరగడం కాదని, రైతుల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. రుణమాఫీ చేయనందుకు పొలాల్లో ఉండాల్సిన రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి దాపురించిందన్నారు. తక్షణమే రైతులకు వడ్డీతో సహా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 

రెండేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని రాఘవరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.  గతేడాది  ఖరీఫ్ లో కోటి ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం చెప్పిన విషయాన్నిఆయన గుర్తు చేశారు.  ఐతే,  85 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, కానీ ఫలితం శూన్యం అని చెప్పారు. పంటలు సరిగా పండక, గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం కూడా కోటి 12 లక్షల ఎకరాలు సాగుచేయాలని ప్రభుత్వం చెబుతోందని,  మృగశిర కార్తె పూర్తి కావస్తున్నా ఇంకా 4 లక్షల 58 వేల 333 ఎకరాలు మాత్రమే సాగవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 

రైతులకు ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీ హామీ పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. కరువు తాండవిస్తోంది. పశువులు కభేలాలకు తరలి పోతున్నాయి. ఇలాంటి సమయంలో రుణాలన్నీ మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈరెండేళ్లలో రెండు దఫాలుగా రూ. 50 వేల మాఫీ చేస్తే అందులో రూ. 22 వేల రుపాయలు బ్యాంకర్లు వడ్డీ కింద తీసుకున్నారన్నారు. మిగతా రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.  తక్షణమే మిగిలిపోయిన 50 శాతం రుణాలు మాఫీ చేసి...రైతులకు తిరిగి రుణాలు వచ్చేలా వెసులుబాటు కల్పించాలన్నారు. 

పంటల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు తలో మాట చెబుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని రాఘవరెడ్డి దుయ్యబట్టారు.  ప్రత్తి పంట వేయొద్దని చెబుతున్న ప్రభుత్వం అందుకు సంబంధించి ఎక్కడైనా, ఏనాడైనా అవగాహన సదస్సులు పెట్టిందా అని ప్రశ్నించారు. ఇప్పటికే 4 లక్షల పై చీలుకు ఎకరాల్లో ప్రత్తి సాగుచేశారని రాఘవరెడ్డి చెప్పారు.  ఆముదాల పంట వేయమని చెబుతుందే తప్ప రైతులకు ఎక్కడా కూడా విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదన్నారు.  రైతుల పట్ల ప్రభుత్వానికి ఇంత కక్ష అని ఎందుకని  రాఘవరెడ్డి నిలదీశారు. 

రైతులకు సోలార్ పంపుసెట్లను సబ్సిడీ కింద అందిస్తామని ముఖ్యమంత్రి, మంత్రి పోచారం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని రాఘవరెడ్డి గుర్తు చేశారు. ఈరెండేళ్లలో  ఒక్కదానికి కూడా సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణలోని 10 వేల గ్రామాల్లో సుమారు 22 లక్షల బోరు బావులుంటే...ప్రభుత్వం కేవలం 3 వేల పంపుసెంట్లకు  టెండర్లు వేయడం దారుణమన్నారు. అందులో  రూ. లక్షా 62 వేలు కేంద్రమే భరిస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటని రాఘవరెడ్డి విమర్శించారు. 

రాష్ట్రంలో 10 లక్షల మంది రైతు కూలీలు ఉండగా...కేవలం 10 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.  ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 70 శాతం రైతు కూలీలే ఉన్నారని,  ప్రభుత్వానికి అది ఎందుకు పట్టడం లేదో అర్థం కావడం లేదన్నారు.  రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడదన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని  ఇల్లందులో ఎస్సీ, ఎస్టీలు  వ్యవసాయం  చేసుకునేందుకు పోడుభూములు ఇస్తే...ఇవాళ దాన్ని కూడా హరితహారం పేరుతో టీఆర్ఎస్ లాక్కోవడం దుర్మార్గమన్నారు. 60 ఏళ్లలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ అని గుర్తుకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. 
Back to Top