గతంలో ఏ హామీ నెరవేర్చావు చంద్రబాబూ!

హైదరాబాద్:

ఎన్నికలు వచ్చిన సందర్భంలో అమలు సాధ్యం కాని హామీలు, ఇష్టం వచ్చినట్టు అబద్ధపు వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని పట్టించుకోకపోడం చంద్రబాబు నాయుడి నైజమని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ‌నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల‌ను పురస్కరించుకుని చంద్రబాబు నవరత్నాలు పేరిట పార్టీ ప్రణాళిక విడుదల చేయడాన్ని కొణతాల ప్రస్తావిస్తూ.. ప్రతి ఎన్నికలకు వాటి సంఖ్య మారుతోందే తప్ప చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన తూర్పారపట్టారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని ఉచిత హామీలిచ్చినా ఫలితం ఉండదని, అది 2009లో నిరూపితమైందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారంనాడు మీడియా సమావేశంలో కొణతాల మాట్లాడారు.

- తొమ్మిదేళ్ల తన పాలనలో ఫలానా వాగ్దానాన్ని అమలుచేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా?
- ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో బియ్యం రూ.2 పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. ఖజానాపై నాలుగు‌ వేల కోట్ల భారం పడుతోందని తొలిసారి రూ.3.50కు ఆ తర్వాత రూ.5.25కు పెంచారు.
- ఇది చాలదన్నట్టు పన్నుల పేరిట ప్రజలపై అదనంగా నాలుగు వేల కోట్ల భారం మోపారు.

- మద్యపాన నిషేధం విషయంలోనూ అలాగే వ్యవహరించారు. బెల్టు షాపులు పెట్టి ప్రతి కిళ్లీ కొట్టులో మద్యం లభించేలా చేశారు.
- వ్యవసాయ విద్యుత్ కనెక్ష‌న్‌ను ఎన్టీఆర్ హా‌ర్సుపవర్ రూ. 50కే అందజేస్తే దాన్ని రూ.650కి పెంచిన ఘనత బాబుది.
- 1999 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు.
- ఆడబిడ్డ పుట్టగానే రూ.5 వేలు డిపాజి‌ట్ చేయడంతో పాటు ఉచితంగా విద్య అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత మంగళసూత్రాలు ఇస్తామన్నారు. చేనేతన్నలకు ఆధునిక మరమగ్గాలు, నా‌యీ బ్రాహ్మణులకు బ్యూటీ పార్లర్లు, రజకులకు దోబీఘాట్లు, కోటి మందికి ఉద్యోగాలంటూ వాగ్దానాల వర్షం కురిపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు.

- జన్మభూమి కార్యక్రమం అని చెప్పి రోడ్డు వేసుకోవాలంటే ప్రజలే వేసుకోవాలని, చెరువులు.. కాలువలు రైతులే తవ్వుకోవాలని, చివరకు గ్రామాల్లో దొంగలు పడుతుంటే ప్రజలే కాపలా ఉండాలంటూ చెప్పిన మహానీయుడు చంద్రబాబు.
- ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనతా చంద్రబాబుదే. ప్రజా ప్రతినిధులకు చెక్‌పవర్ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అలాంటి వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లే‌దని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Back to Top