విస్తృత సమావేశంలో జగన్ కీల‌క ఉపన్యాసం

హైదరాబాద్, 17 నవంబర్ 2013:

సోమవారం (2013 నవంబర్ 18) జరిగే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. మాసబ్ట్యాంక్ వద్ద ‌ఖాజా మేన్షన్ ఫంక్ష‌న్ హా‌లులో సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.

పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి, జాతీయ పార్టీల నాయకులను కలిసి, సమైక్యవాదానికి మద్దతు ఇవ్వమని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరిన విషయం తెలిసిందే. సమైక్య ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ఒక్క వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకే దక్కుతుంది. ఇంతకు ముందు పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా ముఖ్య నాయకులతో కలిసి జాతీయ నాయకులను కలిసి తమ ఉద్యమానికి మద్దతు కోరారు. ప్రస్తుతం శ్రీ జగన్ ఢిల్లీలో సమైక్యవాదం వినిపించి వచ్చిన నేప‌థ్యంలో విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగం కీలకం కానుంది.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తారు. సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీజీసీ, సీఈసీ సభ్యులు, పార్లమెంటరీస్థానాల పరిశీలకులు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.

Back to Top