- చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి
- వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో మొదట ప్రగల్భాలు పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఆడియో టేపులను, ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్‌లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ నెల 8న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా..రెండు రోజుల క్రితం ఈ కేసును పునర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశించి 78 గంటలు గడుస్తున్నా..ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు పేరును చార్జ్‌షిట్‌లో చేర్చకుండా వెనుకడుగు వేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏసీబీ చీఫ్‌గా ఉన్న ఏకే ఖాన్‌కు మంచి పేరుందని, ఆయనకు స్వేచ్ఛ ఇస్తే ఓటుకు కోట్లు కేసులో దాగి ఉన్న నిజా నిజాలు వెలికితీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో కేసీఆర్ నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో బ్రీఫ్డ్‌మీ..అక్కడి నుంచి కేంద్ర మంత్రి సుజనాచౌదరి గవర్నర్ నరసింహన్‌తో బ్రిఫ్డ్‌మీ..ఆయన మరోకరితో బ్రిఫ్డ్‌మీ..ఇలా బ్రిఫ్డ్ మీ భాషను కొనసాగిస్తున్నారని ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చంద్రబాబును విచారించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా మహానేత వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారని ఆయన కోరారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించాలని కొండా రాఘవరెడ్డి కోరారు.