కేసీఆర్ ది తుగ్లక్ పాలన

 • టీఆర్ఎస్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది
 • అఖిలపక్ష భేటీకి  ఆహ్వానించకపోవడంపై కొండా ఫైర్
 • నిరసనగా నిశ్శబ్ద ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం
హైదరాబాద్ః టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఎన్నికల గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను పిలిచి వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వైయస్సార్సీపీని ఆహ్వానించని పక్షంలో  టీఆర్ఎస్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రేపు ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాఘవరెడ్డి మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
 • ఎన్నికల గుర్తింపు ఉన్న ప్రతీ పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం రాజ్యాంగాన్ని గౌరవించడం అనిపించుకుంటుంది. కానీ కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారు
 • రేపటి అఖిలపక్ష సమావేశాన్ని కేసీఆర్ ఇంట్లో దావత్ వ్యవహారంలా చేస్తున్నారు.  పది జిల్లాలను 27 జిల్లాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయ పక్షాల ఆలోచన తీసుకునేందుకు అఖిలపక్షాన్ని మొదటిసారి పిలిచారు. మరి అలాంటప్పుడు అన్ని పార్టీలను పిలిచి వైయస్సార్సీపీని ఎందుకు ఆహ్వానించలేదో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి.  
 • వైయస్సార్సీపీ గుర్తింపుపొందిన పార్టీ. ప్రజాతీర్పుతో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓఎంపీని గెలుచుకున్నపార్టీ. 
 • కేసీఆర్ బెదిరింపులు, ఎంగిలి కూడుకు కక్కుర్తిపడి ఎమ్మెల్యేలు, ఎంపీ పార్టీ మారారు. 
 • వైయస్సార్సీపీ టీఆర్ఎస్ లో విలీనం అయిందని చెప్పే అధికారం, అర్హత కేసీఆర్, స్పీకర్ లకు లేదు. రాజ్యాంగంలో కొన్ని విలువలు, ప్రమాణాలున్నాయి. దానిలో భాగంగానే ఎన్నికల కమిషన్ వైయస్సార్సీపీని రాజకీయ పార్టీగా గుర్తింపునిచ్చింది.   
 • రాజ్యాంగానికి, ఈసీకి, ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేంటో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి
 • కేసీఆర్ ది హిట్లర్, తుగ్లక్ పాలన అని అందరికీ తెలుసు. మసిపూసి మారేడుకాయ చేసేందుకే కేసీఆర్  అఖిలపక్షాన్ని పిలిచాడు. 
 • టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో విలీనమైనమయ్యారని చెప్పించారు. సమావేశానికి టీడీపీని,  ఎమ్మెల్యేలే లేని వామపక్షాలను ఆహ్వానించారు. వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడానికి ఉన్న ఇబ్బంది ఏంటో కేసీఆర్  చెప్పాలి.  బాబు, కేసీఆర్ ల మధ్య లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టాలి.
 • ఇంకా వెయిట్ చేస్తాం. ఇప్పటికైనా జ్ఞానోదయమై రాజ్యాంగబద్దంగా మెసులుకొని ఆహ్వానం పంపితే సరే..లేకుంటే రేపు 11 గంటలకు ట్యాంక్ బడ్ సమీపంలోని డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిశబ్ద ప్రదర్శన చేపడుతాం.  అఖిలపక్ష సమావేశం ముగిసే వరకు నిరసన తెలుపుతాం. బీఆర్ అంబేద్కర్ కు వినతిపత్రం  సమర్పిస్తాం. 
 • వైయస్సార్ తన పాలనలో అఖిలపక్ష సమావేశానికి టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను ఆహ్వానించారు. కేసీఆర్ వైఖరి సరైంది కాదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top