కర్నూలు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం మార్గం ఖరారు

పత్తికొండ:

కర్నూలు జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు  మార్గం ఖరారైందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు. ఆయనతో పాటు పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి స్థానిక నాయకులతో కసాపురం నుంచి మార్గాన్ని  పరిశీలించారు. నవంబర్ 5, 6 తేదీల్లో షర్మిల మరో ప్రజాప్రస్థానం కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుందని ఆయన చెప్పారు. మద్దికెర, అగ్రహారం, పెరవలి గ్రామాల మీదుగా తుగ్గలికి.. అక్కడి నుంచి పత్తికొండ మీదుగా ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, బెళగల్, గూడూరు, నాగలాపురం మీదుగా యాత్ర కర్నూలు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారన్నారు. మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో  బహిరంగసభలు ఏర్పాటవుతాయని ఆయన తెలిపారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిలతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ముఖ్య నేతలు వై.వి. సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొంటారని వివరించారు. జిల్లాలో దాదాపు 13 నుంచి 17 రోజుల పాటు పాదయాత్ర కొనసాగే అవకాశముందన్నారు. గౌరు వెంట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేంద్రనాథ్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎ.క్రిష్ణారెడ్డి, జిల్లా నాయకుడు పోచంరెడ్డి మురళీధర్‌రెడ్డి, మద్దికెర మండల కన్వీనర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శాంతన్న, స్థానిక నాయకులు ఉన్నారు.
ఆదోనిలో... షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్‌ను గౌరు వెంకట రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్‌రెడ్డి పరిశీలించారు. ఆదోని నియోజకవర్గంలో ఆదోని పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర కొనసాగే రూట్‌లలో స్థానిక నాయకులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు మహేంద్ర నాథ్ రెడ్డి, ప్రసాదరావు, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, పట్టణ కన్వీనర్ చంద్రకాంత్ రెడ్డి, నాయకులు విరుపాక్షితో కలిసి గౌరు వెంకట రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో నాయకులు ఫయాజ్ అహ్మద్, సాయిరాం, హనుమప్ప, శీను పాల్గొన్నారు.

Back to Top