కేంద్రం చేతిలో కీలుబొమ్మగా సీబీఐ

హైదరాబాద్, 21 మార్చి 2013:

రాజకీయ కక్షను తీర్చుకోవడానికి యూపీఏ ప్రభుత్వం సీబీఐని ఒక సాధనంగా వాడుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు డి.ఎ. సోమయాజులు చెప్పారు. డీఎంకె నేత ఎమ్.కె. స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులతో సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మని విస్పష్టంగా రుజువైందని ఆయన తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి సీబీఐ, ఈడీ, ఐడీ విభాగాలే ప్రధాన బలమని ఆయన ఎద్దేవా చేశారు. లోక్ పాల్ బిల్లుపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిగినపుడు కూడా కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలూ సీబీఐ వైఖరిని తప్పు పట్టిన అంశాన్ని సోమయాజులు గుర్తుచేశారు. ఒక రకంగా చెప్పాలంటే సీబీఐ ప్రధాన మంత్రి కార్యాలయంలా పనిచేస్తోందన్నారు. స్టాలిన్ ఇంటిమీద దాడులను ప్రధానమంత్రి సహా అగ్రనేతలంతా అలా జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారన్నారు. దాడులను ఆపడానికి ప్రయత్నించారని చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో లోక్ పాల్ వ్యవస్థను, సీబీఐనీ ఉపయోగించి బీజేపీని దెబ్బతీశారనీ, ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారనీ, చివరకు కర్ణాటకలో పరిస్థితులను తమకనుకూలంగా మార్చుకున్నారనీ సోమయాజులు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
రాష్ట్రంలో విడుదలైన 26 జీవోలలో తప్పు లేదని ఎనిమిది మంది ప్రభుత్వ కార్యదర్శులు, ఆరుగురు మంత్రులు కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసినప్పటికీ శ్రీ జగన్మోహన్ రెడ్డి నేరస్థుడని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించినందునే ఆయనకు బెయిలు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు.

వీరభద్రారెడ్డి ఆత్మహత్య కేసుతో బ్రదర్ అనిల్‌కుమార్‌కు సంబంధముందని ఆరోపించడాన్ని ఖండించారు. వీరభద్రారెడ్డి పనిచేస్తున్న కంపెనీ యజమాని కొండల్రావు బ్రదర్ అనిల్‌కు స్నేహితుడు కావడమే దీనికి కారణమన్నారు. అనిల్‌కు కొన్ని వేల మంది స్నేహితులున్నారనీ, వీరభద్రారెడ్డి మృతితో ఆయనకు సంబంధం లేదనీ స్పష్టంచేశారు. ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆత్మహత్య చేసుకున్నారని వీరభద్రారెడ్డి బంధువులు చెప్పిన విషయాన్ని సోమయాజులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనలేకే సీబీఐని ఉసిగొల్పుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. సీబీఐ స్వతంత్ర సంస్థ అని చెప్పినప్పుడు దాని పనితీరులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అగస్టా హెలికాప్టర్ కుంభకోణంలో తాము సీబీఐని అదుపు చేయడం లేదని ప్రభుత్వం చెబుతోందన్నారు. అలాంటప్పుడు ఇంతవరకూ కేసెందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చేతిలో ఉంటుందన్నారు.

ఆఖరికి ఊహాజనిత వార్తలపైనా సీబీఐ అతిగా స్పందిస్తోందని సోమయాజులు ఆరోపించారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా పోటీచేయబోతున్నారని కొందరి పేర్లను ప్రచురించిందనీ, సీబీఐ వారిని నానా ఇబ్బందులకూ గురిచేస్తోందని చెప్పారు. స్వతంత్ర సంస్థ అయితే ఇలా ఎందుకు వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినపుడు ఆమెపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారని గుర్తుచేశారు.

రాజకీయ ప్రత్యర్థులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి యూపీఏ ఇలాంటి గేమ్ ఆడుతోందనీ, దీనిని ప్రశ్నిస్తున్నామనీ సోమయాజులు తెలిపారు. దీనిని ప్రజాస్వామ్యమంటారా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద మద్దతుదారు సీబీఐ మాత్రమేననీ, డీఎంకేనో, మరో పార్టీనో కాదని వ్యంగ్యోక్తి విసిరారు.

Back to Top