కార్మిక సంక్షేమం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధ్యేయం

హైదరాబాద్, 1 మే 2013: ప్రజలకు మేలు జరగాలంటే మనసున్న నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అభిప్రాయపడ్డారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని అందించి మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని ఆమె గుర్తుచేశారు. అన్ని రంగాలనూ ఆ మహానేత అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. కార్మికుల సంక్షేమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. మేడే సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరైన కార్మికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలూ తీరతాయని ఆమె హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌బాబు నేతృత్వంలో మహానేత నాటి సువర్ణయుగాన్ని మళ్ళీ తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలనే ప్రస్తుతం కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలోనూ చవిచూస్తున్నామని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

మేడే దినోత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు శ్రీమతి విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసి మేడే వేడుకలు నిర్వహించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరులోనే శ్రామికులను చేర్చి ప్రముఖ స్థానం కల్పించిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. కార్మికులు, శ్రామికులు సాధించిన విజయాలకు గుర్తుగా మేడే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వల్ల వేలాది పరిశ్రమలు మూతపడి  20 లక్షల మంది కార్మికులు ఉపాధి లేక వీధిన పడ్డారని ఆమె విచారం వ్యక్తంచేశారు. విద్యుత్‌ కోతలు పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా వస్తాయని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, 37 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇటీవల పార్టనర్‌ సమ్మిట్‌లో గొప్పగా చెప్పారన్నారు. అయితే, ఆ పెట్టుబడులు ఏవని, ఉపాధి ఎంత మందికి దొరికిందని నిలదీశారు. పారిశ్రామికవేత్తలు, అధికారులను వేధిస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా పెడతారని ప్రశ్నించారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన హయాంలో మన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించింది మహానేత వైయస్‌ అన్నారు. రాష్ట్రంలో అనే విద్యుత్‌ ప్రాజెక్టులను తీసుకువచ్చి వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగడానికి వైయస్‌ వీలు కల్పించారన్నారు. ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, తద్వారా లక్షలాది మంది శ్రామికులకు ఉపాధి దొరికేందుకు వైయస్‌ కృషి చేశారన్నారు.

‌పరిశ్రమలకు నీళ్ళిస్తేనే క్విడ్‌ ప్రో కో జరిగిందని కాంగ్రెస్‌ టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను శ్రీమతి విజయమ్మ తిప్పికొట్టారు. ఒక కార్ల సంస్థకు కిరణ్‌కుమార్‌రెడ్డి 130 శాతం కల్పించడం క్విడ్‌ ప్రో కో కిందకు రాదా అని ఆమె నిలదీశారు. ప్రాజెక్టులు కట్టడం అంటేనే చంద్రబాబుకు నచ్చదని, ప్రభుత్వ సంస్థలను నష్టాల్లోకి నెట్టివేశారని, అనేక పరిశ్రమలను అయినకాడికి అమ్మివేశారని, ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని, కార్మికు భద్రతను పట్టించుకోలేదని చంద్రబాబును ఆమె దుయ్యబట్టారు. దేశంలోని చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు ద్వారాలు బార్లా తెరిచేందుకు చంద్రబాబు సహకరించారని, తద్వారా లక్షలాది మంది పొట్టగొట్టారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు మాదిరి పాలనే కొనసాగుతోందని శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రంగాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మహానేత రూపొందించి, అమలు చేసిన పథకాల పేర్లను మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపథకాలంటూ ఆర్భాటం చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. పథకాలను ప్రకటించడం కాకుండా వాటిని అమలుచేసే మంచి మనసు పాలకులకు ఉండాలని ఆమె సూచించారు.

అంతకు ముందు శ్రీమతి విజయమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని కేక్‌ను కట్‌ చేశారు. సభలో పార్టీ నాయకులు పిఎన్‌వి ప్రసాద్‌, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు బి. జనక్‌ప్రసాద్‌ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. వేదిక పైన పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తదితరులు ఆశీనులయ్యారు. జై జగన్‌, వైయస్‌ఆర్‌ అమర్‌ రహే, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Back to Top