కాణిపాకంలో ప్రమాణం చేద్దామా!

అనంతపురం:

డబ్బులకు ఆశపడే ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు  ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో షర్మిలతో పాటూ పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైయస్ జగన్మోహన్‌ రెడ్డి నాకు రూ.పది కోట్లు ఇవ్వడం వల్లే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరానని చంద్రబాబు చెబుతున్నారు. చేరే ఎమ్మెల్యేలపైనా ఇదే రకమైన అభాండాలు వేస్తున్నారు. చంద్రబాబూ... నువ్వు చేసే ఆరోపణలపై నీకు నమ్మకం ఉంటే, మాట మీద నిలబడే వ్యక్తివైతే  కాణిపాకానికి వస్తే వినాయకుని ఎదుట ప్రమాణం చేద్దామ'ని సవాలు చేశారు. మహానేత వైయస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. వైయస్ పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందుకే జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేకే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయించాయని దుయ్యబట్టారు. ‘జగన్‌ను జైలులో ఉంచితే ఆయనకు ప్రజల మద్దతు రెట్టింపయ్యింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో వైయస్ఆర్‌ సీపీ విజయభేరి మోగించడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ‘మరో ప్రజాప్రస్థానం’ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు వస్తాయి. 2013లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంద’ని వివరించారు.
‘చంద్రబాబు పాదయాత్ర బూటకం... ఓ నాటకం.
'పగటివేషాలతో జనాన్ని బతిమాలుతున్నారు. కుట్టుమిషను మీద గుడ్డలు కుడుతున్నారు. నేను ఐదు మీటర్ల గుడ్డను పంపుతా... రెండు చొక్కాలు కుట్టగలరా’ అంటూ ఎద్దేవా చేశారు. నీలం తుపాను వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, ప్రాణనష్టం సంభవిస్తున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని నల్లపురెడ్డి మండిపడ్డారు.

Back to Top