తాడేపల్లి: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందని, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభించడం వల్లే మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వరుదు కళ్యాణి ఆక్షేపించారు. వరుదు కళ్యాణి ఇంకా ఏమన్నారంటే..: మహిళలు, బాలికలకు రక్షణ లేదు మదనపల్లెలో ఏడేళ్ల మైనర్ బాలికను ఓ తాగుబోతు హత్య చేసి డ్రమ్‌లో వేయడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పదేపదే మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి దారుణాలు చేసే వారికి ఈ ప్రభుత్వంలో కఠిన శిక్షలు ఉంటాయనే భయం లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు స్కూల్‌కు వెళ్లారంటే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం తల్లిదండ్రులకు లేకుండా పోయింది. అఘాయిత్యాలకు మద్యం పాలసీనే కారణం మదనపల్లిలో మద్యం మత్తులో మైనర్ బాలికను హత్య చేశారంటు హోం మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ, పర్మిట్ రూములు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులే కారణం. విచ్చలవిడిగా మద్యం సేవించిన కామాంధులు ఇలా ఆడబిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులను మహిళల రక్షణకు ఉపయోగించకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుకు, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. బాలికల భద్రతపై మంత్రులకు శ్రద్ధ లేదు హోం మంత్రి అనిత బిల్ గేట్స్‌తో ఫోటోలు దిగేందుకు చూపించిన శ్రద్ధ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలను పరామర్శించడంలో ఎందుకు కనిపించడం లేదు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్స్‌లో దేశ విదేశాలు తిరుగుతూ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ విద్యార్థులకు రక్షణ, వసతులపై శ్రద్ధ చూపడం లేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నిందితులను ఎందుకు శిక్షించడం లేదు? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రోజుకు దాదాపు 80 ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలే చెప్పారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు ఓ బాలికను లైంగికంగా వేధిస్తే అతనిపై ఫోక్సో కేసు పెట్టకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది అత్యంత హేయం. అనపర్తిలో 6వ తరగతి బాలికపై అత్యాచారం జరిగితే స్థానిక ఎమ్మెల్యే నిందితుడికి మద్దతుగా నిలిచాడని బాధిత కుటుంబం చెబుతోంది. ఇన్ని ఘటనలు జరిగినా నిందితులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. మదనపల్లిలో నిందితుడిపై గతంలో కూడా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. అతనిపై ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పడం కాకుండా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.