రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్ 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి  గుడివాడ అమ‌ర్నాధ్ మండిపాటు
 

తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్ అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి  గుడివాడ అమ‌ర్నాధ్ మండిప‌డ్డారు. ఇవాళ తూర్పు గోదావ‌రి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్య‌మ నేత‌, పార్టీ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌రామ‌ర్శించారు. అనంత‌రం అక్క‌డే నేత‌లు మీడియాతో  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మాజీ మంత్రి అంబటి ఇంటిపై జరిగిన దాడి, బ‌డ్జెట్‌పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా గుడివాడ అమ‌ర్నాథ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రభుత్వం పబ్లిసిటీ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్‌కే పరిమితమైందని విమర్శించారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కనీస అవగాహనతో కూడిన కూర్పు కూడా లేదని, రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటోందని, సరాసరిన రోజుకు రూ.500 కోట్లు అప్పు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల్లో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ కింద పేదల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలను నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగానికీ సరైన కేటాయింపులు లేవని, రైతులు యూరియా కోసం రోడ్లపై కొట్టుకుంటున్నారని అన్నారు. రూ.6,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. పేదల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. 

మాజీ మంత్రి అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయ‌న ఇంటిపై ఇటీవ‌ల ప‌చ్చ‌మూక‌లు దాడి చేశార‌ని అమ‌ర్నాథ్ ధ్వ‌జ‌మెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి, దాడికి పాల్పడినవారిని స్టేష‌న్ బెయిల్‌పై విడుద‌ల చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఆక్షేపించారు. ఇదేనా రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలనా? అని ప్రశ్నించారు.
అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించడమే కారణంగా అంబటి రాంబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బడ్జెట్ పుస్తకం మొత్తం డొల్లగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ప్రజలు త్వరలో సమాధి కడతారని  ఆయ‌న హెచ్చరించారు.
 

Back to Top