కూట‌మి నేత‌ల విమ‌ర్శ‌ల‌కు ష‌ర్మిల ఎందుకు స్పందించడం లేదు..?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సూటి ప్ర‌శ్న‌

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంపై ఫ్యాక్షన్ ముద్ర వేయడం రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. వైయ‌స్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న కూట‌మి నేత‌ల‌పై ష‌ర్మిల ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. “మీ వంశమే ఫ్యాక్షనిస్టుల వంశం అని విమర్శలు వస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు..? మీ తాత, తండ్రి, సోదరుడిని బ్రష్టు పట్టించేలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు..?” అని ఆయన ప్రశ్నించారు.

అలాగే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేయని తప్పులకు ఆయన పార్టీని “గొడ్డలి పార్టీ”గా పదేపదే తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జగన్ మంచితనం వల్లే రాజారెడ్డి హత్యకు కారణమైన వారు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.  బీటెక్ రవి చేసిన “జగన్ అనుకుంటే అరగంట చాలు నన్ను అంతమొందించడానికి” అన్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు. వైయ‌స్‌ రాజశేఖర రెడ్డిని మానవతావాదిగా అభివర్ణించిన రాచమల్లు, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 సేవలు వంటి పథకాల సృష్టికర్త వైయ‌స్ఆరేనని పేర్కొన్నారు.

అలాగే వైయ‌స్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరే హత్య చేశానని చెబుతున్నాడని గుర్తు చేశారు. “చంద్రబాబు కేసులు వాదించే ప్రముఖ లాయర్ లూత్రానే దస్తగిరి తరఫున వాదిస్తున్నారు” అని ఆరోపించారు. వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి తెల్లటి కాగితంలాంటి వ్యక్తి, హత్య రాజకీయాలకు దూరంగా ఉంటారని రాచమల్లు అన్నారు. “1980 తర్వాత రాజకీయాల్లో రక్తపు మరకలు లేకుండా ఒక్కరైనా అసెంబ్లీ గేటు తగిలారా?” అని ప్రశ్నించారు. “రాజారెడ్డి ఒక్కడినే ఫ్యాక్షనిస్టు అంటున్నారు. మరి దేవగుడి సోదరులు, పోతుల సురేష్, పార్థసారథి రెడ్డి ఫ్యాక్షనిస్టులు కారా?” అంటూ రాచ‌మ‌ల్లు వ్యాఖ్యానించారు.
 

Back to Top