కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి

గుడ్లవల్లేరు, 04 ఏప్రిల్ 2013:

ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికీ, దానికి వంత పాడుతున్న టీడీపీ పార్టీకీ సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని శ్రీమతి వైయస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారంనాటికి 111 రోజులు పూర్తయ్యింది. ఉదయం వడ్లమన్నాడులో ఏర్పాటుచేసిన రచ్చబండలో ఆమె మహిళల సమస్యలను విన్నారు. అనంతరం పాదయాత్రగా వెడుతూ అందరినీ పలుకరించారు. గుడ్లవల్లేరులో ఏర్పాటైన కార్యక్రమంలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం తప్పక వచ్చితీరుతుందని ఆమె స్పష్టంచేశారు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజశేఖరరెడ్డిగారి ప్రతి పథకానికీ జగనన్న జీవం పోస్తాడని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. రైతుని మళ్ళీ రాజుని చేస్తాడని ప్రకటించారు. రైతులకీ, మహిళలకీ వడ్డీ లేకుండానే జగనన్న రుణాలిస్తాడని తెలిపారు. రైతు పండించిన పంట నష్టపోకుండా దానిని ప్రభుత్వమే కొనేలా చేసేందుకు 3 వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తారని చెప్పారు. ప్రతి రైతు లాభపడేలా.. ప్రతి రైతూ అప్పుల ఊబినుంచి బయటపడేలా చేస్తారన్నారు. రాజన్న రాజ్యంలో జగనన్న అన్ని హామీలను నెరవేరుస్తారని శ్రీమతి షర్మిల ప్రజల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలుచేస్తారన్నారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత వృద్ధులకి, వితంతువులకీ పింఛన్లు రెట్టింపవుతాయన్నారు. వికలాంగులకి పింఛను వెయ్యి రూపాయలవుతుందన్నారు. పిల్లలను చదివించుకోడానికి మహిళల బ్యాంకు ఖాతాలలో 500 చొప్పున డిపాజిట్ అవుతుందన్నారు. ఆరోజు వచ్చేంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలనీ, మాతో కలిసి కదం తొక్కాలనీ శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

తాజా ఫోటోలు

Back to Top