కాంగ్రెస్ పార్టీని ఎన్నడో వీడాం

హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీని దూషించేవారు.. డబ్బుకోసమో.. ఇతరత్రా అంశాలకో అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించినట్లేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన శుక్రవారం రాజకీయంగా సంచలనం సృష్టించింది. బహిష్కరించారని చెబుతున్న ఎమ్మెల్యేల్లో ఐదుగురి పేర్లు మాత్రమే బొత్స చెప్పడంతో మిగిలినవారెవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పేర్లు వెల్లడైన అయిదుగురు ఎమ్మెల్యేలూ తామెప్పుడో కాంగ్రెస్ పార్టీని వీడామని స్పష్టంచేశారు. మేమే కాదు.. ఇంకా పెద్ద సంఖ్యలో మంత్రులూ, ఎమ్మెల్యేలూ కూడా చేరతారంటూ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. దర్శి, అద్దంకి, బొబ్బిలి, మచిలీపట్నం ఎమ్మెల్యేల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

మునిగిపోయే పడవ కాంగ్రెస్: బూచేపల్లి

     ఏడాదిన్నర క్రితమే తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చెప్పారు.  పేదల కోసం అహర్నిశలూ శ్రమించిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానన్నారు. త్వరలోనే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. ఈ ప్రభుత్వం మనుగడ కొద్దిరోజులు మాత్రమే ననీ, కాంగ్రెస్ మునిగిపోయే నావనీ పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ ఆమోదం పొందే పరిస్థితి కూడా ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ నాని కూడా ఆ పార్టీని విడిచిపెట్టారంటే పాలకులు సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ప్రస్తుతం ఉన్నవారు కూడా అధికారం చూసి మాత్రమే కొనసాగుతున్నారని అభిప్రాయపడ్డారు. సహకార ఎన్నికల్లో కాం గ్రెస్, టీడీపీల చీకటి రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని శివప్రసాద్ తెలిపారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీనే బహిష్కరించారు: గొట్టిపాటి

     'కాంగ్రెస్ పార్టీ నన్ను బహిష్కరించడమేమిటి? నేనే ఆ పార్టీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చాననీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇప్పుడు కొత్తగా బాధపడేదేమీ లేదన్నారు. నేను దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానిననీ, సహకార ఎన్నికల్లో టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్‌ను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారనీ స్పష్టంచేశారు. సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలిచే చోట్ల ఎన్నికలు నిలపివేయడం ఎవరికి తెలియని విషయమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయనీ, ముందు ఆ పార్టీలోని వారి భవితవ్యం చూసుకోవాలనీ గొట్టిపాటి హితవు పలికారు.

ఎప్పుడో  రాజీనామా చేశా: సుజయకృష్ణ రంగారావు

     తాను కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నెలల కిందటే రాజీనామా చేశానని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చడంతోపాటూ ప్రజాభిమానం ఉన్న నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డిని వేధింపులకు గురిచేయడాన్ని తట్టుకోలేక ఈ పనిచేశానన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తే తీరిగ్గా ఇప్పుడు పార్టీనుంచి  బహిష్కరించామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ కుటుంబంపై కక్ష సాధింపుతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు.  సహకార ఎన్నికల నేపథ్యంలో.. ఏం చేయాలో పాలుపోక ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చారని ఆయన చెప్పారు.

ఇప్పుడు బహిష్కరించామనడం మానసికానందానికే: పేర్ని నాని

     కాంగ్రెస్ పార్టీకి తాను ఎప్పుడో రాజీనామా చేశానని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) స్పష్టంచేశారు. ఇన్నాళ్లకు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించి మానసికానందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు. జనాభీష్టానికి అనుగుణంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్‌కు, విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గత నెల 24నే ప్రకటించానన్నారు.  నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయలేదనీ, నమ్మిన సిద్ధాంతం కోసమే ధైర్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశాననీ స్పష్టంచేశారు. డాక్టర్ వైయస్ఆర్  ఆశయసాధనకు  శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి వెంటే  ఉంటానని సుజయకృష్ణ పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top