ఇంక రెండేళ్లే..రాబోయేది ప్రజల ప్రభుత్వం

 • సీఎం పదవికి బాబు అనర్హుడు
 • పోలవరం నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం
 • పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదు
 • భూములిచ్చిన రైతులందరికీ ఒకే రకమైన పరిహారం ఇవ్వాలి
 • గిరిజనులకు అందని వైద్యసేవలు..ముంపు మండలాల్లో ఒక్క పర్మినెంట్‌ అధికారి లేడు
 • గురుకుల పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కరువు
 • ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవోను నియమించలేని అసమర్ధ సర్కార్‌
 • పేదల ఉసురు పోసుకున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు
 • ప్రతి పేదవాడు ఒక్కటవుతారు..ఆ సునామీలో బాబు కొట్టుకుపోతారు
 • వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సమన్యాయం
 • రేఖపల్లి బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: చంద్రబాబు పాలన మరెంతో కాలం సాగదని,  ఇప్పటికే మూడేళ్లు పూర్తి అయ్యిందని, ఇక రెండేళ్లే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఆ తరువాత మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, ఆ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్న గిరిజనులకు న్యాయం చేయడం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వైయస్‌ జగన్‌ పోలవరం ముంపు ప్రాంతాలు, విలీన మండలాల్లో పర్యటించారు. సాయంత్రం రేఖపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలవరం నిర్వాసితుల పట్ల టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వైయస్‌ జగన్‌ తూర్పారబట్టారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు జరిగాయన్నారు. మహానేతపై నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం భూములిచ్చారని గుర్తు చేశారు. అప్పట్లో ఇచ్చిన పరిహారం తప్పా ఆ తరువాత ప్రభుత్వాలు నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కోసం గిరిజనులు చేస్తున్న త్యాగాలను మర్చి పోకుండా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిదే అన్నారు. అయితే మన దురదృష్టం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అన్నారు. చంద్రబాబు  కాంట్రాక్టర్లపై చూపించే శ్రద్ధ నిర్వాసితులకు న్యాయం చేయడంలో చూపించడం లేదని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. 

మూడేళ్లలో ఒక్క ఎకరా కూడా ఇవ్వకపోగా..
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో గిరిజనులకు ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వకపోగా..అత్తగారి సొత్తు అన్నట్లు గిరిజనుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. భూములు తీసుకున్నా ఫరవాలేదు, మా బాధలు వినండి, మాకు మంచి ప్యాకేజీ ఇవ్వండి అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు గిరిజనులకు అందరికీ భూముల మీద హక్కులు కల్పించారని గుర్తు చేశారు. దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాలకు పట్టాలు పంచారని తెలిపారు. బాబు అధికారంలోకి వచ్చాక ఈ భూములు లాక్కొని సరైన పరిహారం ఇవ్వడం లేదన్నారు. చట్ట ప్రకారం ప్రాజెక్టు కమాండ్‌ ఏరియాలోనే భూమికి భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. డి. పట్టా భూములపై ఆధారపడ్డ నిరుపేదలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, రైతులకు ఒకరకంగా, గిరిజనులకు మరోరకంగా పరిహారం చెల్లిస్తున్నారని విమర్శించారు. 

రైతుల డిమాండ్లు న్యాయబద్ధమే
పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా పరిహారం ఇస్తూ ప్రభుత్వం వారి మధ్యే చిచ్చు పెడుతుందని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు. 2007– 2009 సంవత్సరం మధ్యలో తీసుకున్న భూములు ఎకరాకు రూ. 1.50 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. ఆ డబ్బులతో ఇప్పుడు భూములు కొనే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు భూములు అప్పగించిన రైతులు అదనపు పరిహారం అడగడం న్యాయబద్ధమైన డిమాండే అని వైయస్‌ జగన్‌ అన్నారు. ప్రభుత్వం రూ.19 లక్షలు ఇవ్వలేకపోయినా కొద్దిగా అటూ ఇటూగానైనా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామనడం న్యాయం కాదు. నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు నుండి కాకుండా... అవార్డు ఆఫ్‌ ఎంకై ్వరీ జరుగుతున్న ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. భూమి లేకున్నా నిర్వాసితులకు రూ.10 లక్షలు తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలన్నారు. ఆ మేరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వచ్చే విధంగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తామని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.

4వ స్థానంలో ఉన్నామని చెప్పడం సిగ్గుచేటు
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించడం సిగ్గు చేటని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు వీరికి కనిపించడం లేదా అని ఫైర్‌ అయ్యారు. ఇంతలా గొప్పలు చెబుతున్న చంద్రబాబుకు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న అవస్థలు పట్టవా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యంపై చంద్ర బాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. గిరిజనుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలంలో 4 నెలల వ్యవధిలో 14 మంది చిన్నారులు పౌష్టికాహారం లోపంతో మృత్యువాత పడటం బాధాకరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అరకొరగా పౌష్టికాహారం అందజేస్తున్నారని గిరిజనులు చెబుతున్నారని తెలిపారు. మందులు కూడా ఇవ్వడం లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.  చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం లేదని, ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకుండా కమీషన్లు వచ్చే ప్రాజెక్ట్‌లకు అదనపు చెల్లింపులు చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి పాలనలో 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో కుయ్‌..కుయ్‌ అంటూ వచ్చేవని గుర్తు చేశారు. ఐటీడీఏ పరిధిలో వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలో ముగ్గురు డాక్టర్లు ఉంటే వారు కూడా సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం గిరిజనులు పడరానిపాట్లు పడుతున్నారని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో 10 అంబులెన్స్‌లు ఉంటే ప్రస్తుతం 3 మాత్రమే పని చేస్తుండటం సిగ్గు చేటన్నారు. కనీసం రెగ్యులర్‌ పీవోను నియమించలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు. ఈ ప్రాంతంలో రెగ్యులర్‌ అధికారులే లేరని, అందరూ ఇన్‌చార్జ్‌లే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
  
స్వచ్ఛ భారత్‌కు నీవా అంబాసిడర్‌
 రాష్ట్రంలో అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు చేశామంటూ, ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి కట్టించామని చంద్రబాబు డప్పాలు కొట్టుకుంటున్నారని, స్వచ్ఛ భారత్‌కు అంబాసిడర్‌ అని ప్రకటించుకోవడం సిగ్గు చేటని వైయస్‌ జగన్‌ విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్టల్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, తలుపులు, నీళ్లు లేక పిల్లలు డబ్బాలు పట్టుకుని కొండల మీదకు వెళుతున్నారని తెలిపారు. ఈ దుస్థితికి  చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. వసతిగృహ భవనాన్ని పరిశీలించిన జగన్‌... పెచ్చులు ఊడిపోయి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 

అండగా ఉంటా
 గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదుర్కొంటున్న నష్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయాన్ని గట్టిగా నిలదీసేందుకే ఈ ప్రాంతానికి వచ్చానని వైయస్‌ జగన్‌ చెప్పారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లు సాధన కోసం పోరాడతానని పోలవరం నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.  ఇంతవరకూ మీకు వైయస్‌ఆర్‌సీపీ అండదండగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని అప్పుడు  ఎకరాకు రూ.19 లక్షలు ఇచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు. బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మాజీ మంత్రి పెనిపే విశ్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.

 


 
Back to Top