<strong>కర్నూలు, 21 నవంబర్ 2012:</strong> కర్నూలు నగరం బుధవారంనాడు జనసంద్రమై కనువిందు చేసింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు ఆమె వెంట అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు విశేషంగా తరలివచ్చిన వారితో కర్నూలు నగరం కోలాహలంగా మారింది. షర్మిల పాదయాత్ర బుధవారం మధ్యాహ్నానికి చెన్నమ్మ సర్కిల్‌కు చేరుకుంది. షర్మిల చేస్తున్న పాదయాత్ర 35వ రోజు కొనసాగుతోంది. నగర శివార్లలోని సెయింట్ క్లార్కు పాఠశాల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది.<br/>చెన్నమ్మ సర్కిల్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించిన తరువాత కృష్ణనగర్‌లో మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. మసీదు సెంటర్, గాయత్రి ఎస్టేట్ రోడ్, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజీ గేట్, బుధవారపేట, కల్లూరి వంతెన, వన్ టౌన్ పోలీసు స్టేషన్, పూల బజార్, పెద్దమార్కెట్, పాత బస్‌స్టాండు వరకూ పాదయాత్ర చేస్తారు. పాతబస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పోలీస్ లైన్, ప్రకాశ్ నగర్ దాటిన తరవాత సెయింట్ జోసెఫ్ కళాశాలలో బుధవారం రాత్రికి షర్మిల బస చేస్తారు.