జలీల్ ఖాన్ రౌడీయిజం..జర్నలిస్ట్ పై దాడి

విజయవాడ: 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ తన రౌడీయిజాన్ని  ప్రదర్శించారు. ఇటీవలే జర్నలిస్టులపై దాడికి పాల్పడిన  కేసులో విచారణ ఎదుర్కొంటున్న జలీల్ ఖాన్ ....మరో విలేకరిపై దాడులకు తెగబడ్డారు.  రాత్రి నగరానికి చెందిన ఓ విలేకరిపై భౌతికదాడికి దిగారు.

వివరాల్లోకి వెళ్లితే.. తారాపేటలోని జలీల్‌ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదు, గోరీలదొడ్డి (ముస్లిం శ్మశానవాటిక) చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక ముస్లిం ప్రముఖులు గోరీలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. తనకు చెప్పకుండా  సమావేశం పెట్టుకోవడమేమిటని జలీల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడకు చేరుకున్నారు. అందరినీ బూతులు తిట్టడం ప్రారంభించారు.

అటుగా వెళ్తున్న ప్రెస్‌క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ.. గమనించి లోపలకు వెళ్లారు. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయసాగారు. దాంతో జలీల్‌ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి ‘ఎవడ్రా ఫోటోలు తీస్తోంది.. వాడిని కుమ్మండ్రా’ అంటూ తన అనుచరులను ఆదేశించారు. జలీల్‌ఖాన్ అనుచరులు షఫీపై దాడికి పాల్పడ్డారు. ఫోన్‌ను ధ్వంసం చేశారు. జలీల్‌ఖాన్‌తో షఫీ మాట్లాడబోగా.. ‘ఎక్కువ మాట్లాడకు.. జైలులో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’ అంటూ చిందులుతొక్కారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Back to Top