జగన్‌, వైయస్‌ దోషులనడానికి వారెవరు?

మైలవరం (కృష్ణా జిల్లా), 14 ఏప్రిల్2013: అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టి మరీ ఆయన కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని దుయ్యబట్టారు. అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ఆనాడు ఈ ప్రజాకంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయి ఉండేదని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ బిల్లుల భారం ఉండేది కాదన్నారు. కిరణ్‌ ప్రభుత్వ హయాంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమైపోయాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన సభలో కిరణ్‌ ప్రభుత్వంపైన, చంద్రబాబాబు తీరుపైన శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను నిలబెట్టింది మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ అన్నారు.

మహానేత ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద ఈ ప్రభుత్వం వచ్చిందని.. ఈ ప్రభుత్వ హయాంలో బతుకు భారమైపోయిందని రైతులు బాధపడుతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే విద్యుత్‌ సమస్య తలెత్తిందని, మూడు గంటలు కూడా ఈ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వలేక ఆపసోపాలు పడుతోందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని, కరెంటు ఇవ్వమంటే తలుపులు కిటికీలు తెరిచి పడుకోమంటున్నారు ఈ ముఖ్యమంత్రి అని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయని.. కాని ఆయన చేతలు గడప కూడా దాటవన్నారు. కరెంటు ఇవ్వకుండానే దారుణంగా బిల్లులు వేస్తున్నారని, ప్రజల రక్తం పిండైనా సరే బిల్లుల్ని ఈ ప్రభుత్వం వసూలు చేయాలనుకుంటోందన్నారు. ఛార్జీలు ప్రజల నెత్తిన పడి ఉండేవి కావని, చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి నడుస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మహానేత డాక్టర్‌ వైయస్‌ భవిష్యత్తు ఇచ్చారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆయనను తన సోదరుడిలా చూసుకున్నారన్నారు. అలాంటి ఆయనపై ఆనం ఇప్పుడు నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అహం పెరిగినప్పుడు మనిషి తన స్థాయిని మరిచిపోయి, తానే దేవుడనుకుంటాడట. రామనారాయణరెడ్డి ఇదే స్థితిలో ఉన్నారు ఈవేళ అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఆనం మాటల్లో వాస్తవం ఉందని బొత్స సమర్థించడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. మహానేత వైయస్‌ బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు అని పొగిడినవారు ఇప్పుడు విమర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు.

జగనన్నకు 14 ఏళ్ళు జైలులో పెడతానని సిఎం కిరణ్‌ కుమార్‌రరెడ్డి ఇదివరకే తీర్పు ఇచ్చేశారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్‌రరెడ్డి దోషి అని నిర్ధారించడానికి మీరెవరు? అంటూ శ్రీమతి షర్మిల నిలదీశారు. జగనన్న, వైయస్‌ఆర్‌ దోషులని ఏ కోర్టూ తీర్పు చెప్పలేదన్నారు. బొత్స మాఫియా డాన్‌ కాదు... నిర్దోషి అని ఏ కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రశ్నించారు. చిరంజీవి బంధువుల ఇంటిలో దొరికిన రూ. 70 కోట్లు సక్రమం అని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని తన బినామీలకు చంద్రబాబు కట్టబెట్టలేదని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. నక్కజిత్తులతో తమపై విచారణ జరగకుండా చూసుకునే తెలివి వీరందరికీ ఉందని శ్రీమతి షర్మిల విమర్శించారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు ఇప్పుడు హామీలు గుప్పిస్తున్నారని.. పులి పులే.. నక్క నక్కే అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. మహానేత వైయస్‌ఆర్‌ పథకాలన్నింటినీ అమలు చేస్తామని మేం ధైర్యంగా చెబుతున్నామన్నారు. తన పాలనను తిరిగి తెస్తానని చెప్పే ధైర్య చంద్రబాబుకు ఉందా? అని శ్రీమతి షర్మిల సవాల్‌ చేశారు.
Back to Top