జగన్‌కు బెయిల్ ఎందుకివ్వకూడదు?

  • సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు
  • అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలన్న జగన్ పిటిషన్ కొట్టివేత
  • విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
  • సాయిరెడ్డికి కోర్టు నోటీసులు..
  • వచ్చే వారం విచారణ ?
  • న్యూఢిల్లీ : పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసి, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. జగన్­కు బెయిల్ ఎందుకు మంజూరు చేయరాదో వివరించాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన అరెస్టును అక్రమంగా ప్రకటించాలని కోరుతూ జగన్మోహన్­రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను మాత్రం ధర్మాసనం తోసిపుచ్చింది. 

    బెయిల్, అక్రమ అరెస్టు పిటిషన్లలోని వాదనలు ఒకేలా ఉండే ఆస్కారముంది. అక్రమ అరెస్టు పిటిషన్‌ను విచారిస్తే వాదనలు పునరావృతమయ్యే అవకాశముంది. అందువల్ల సమయం వృథా కారాదనే ఉద్దేశంతోనే రెండో పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దుచేసి బెయిల్­ మంజూరు చేయాలంటూ జూలై 28న సుప్రీంలో జగన్మోహన్­రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద జీవోలకు సంబంధించి ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు న్యాయ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేసిందని ఆ పిటిషన్­లో జగన్మోహన్­రెడ్డి పేర్కొన్నారు. 

    'అవే జీవోలు క్విడ్ ప్రొకొలో భాగంగా జారీ అయ్యాయని, అందుకే తన కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ అంతకు ముందు సీబీఐ నాపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. కానీ మంత్రులు, ఐఏఎస్‌లకు ప్రభుత్వం ఇప్పుడు న్యాయ సాయం చేస్తున్నందున ఆ జీవోలు క్విడ్­ప్రొకొలో భాగం కాదని స్పష్టమవుతోంది. తద్వారా నేను ఏ నేరమూ చేయలేదని కూడా రుజువవుతోంది ' అని జగన్మోహన్­రెడ్డి వివరించారు. 

    దర్యాప్తు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా తాను ఆ ప్రక్రియలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదనీ, సాక్షులను ప్రభావితం చేయలేదనీ ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్­ కోర్టును అభ్యర్థించారు. తన అరెస్టును అక్రమంగా ప్రకటించాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మరో పిటిషన్ కూడా జగన్మోహన్­రెడ్డి దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై గురువారం ఉదయం ధర్మాసనం విచారణ చేసింది. ఆ పిటిషన్లను పూర్తిస్థాయిలో పరిశీలించింది. వెంటనే సీబీఐకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్మోహన్­రెడ్డికి ఎందుకు బెయిల్­ ఇవ్వరాదో వివరించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఎప్పుడన్నది మాత్రం ధర్మాసనం స్పష్టంగా చెప్పలేదు. 

    సాయిరెడ్డికి నోటీసులు

    ఆడిటర్ విజయసాయిరెడ్డికి హైకోర్టు బెయిల్­ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించింది. విజయసాయికి నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్‌నూ, దాన్నీ ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. నిర్దిష్ట తేదీ మాత్రం చెప్పలేదు. పిటిషన్‌పై వచ్చే వారం వాదనలు జరిగే అవకాశముందని విచారణ అనంతరం జగన్మోహన్­రెడ్డి తరఫు న్యాయవాది సురేశ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో మీడియాకు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top