అమరావతి: ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నవరత్న కార్యక్రమాలు సహా అనేక పథకాలను అమలు చేయడానికి నిర్ణయించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వీటిపై సమగ్ర సమాచారంతో ‘జగన్ అన్న ఫర్ సీఎం’ అనే నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్‌సైట్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించింది. నవరత్నాలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర, వైయస్ఆర్ కుటుంబం, జగన్ స్పీక్స్ విభాగాలుగా ఇందులో ఆయా అంశాలను పార్టీ పొందుపరిచింది.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు ద్వారా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని పంచేందుకు వీలుగా అందరి తోడ్పాటుకు పిలుపునిచ్చింది. ఆయా కార్యక్రమాలపై సవివరంగా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. వైయస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, మద్యవిధానం ఇలా ఆయా అంశాలను వివరించారు. ఈ వెబ్‌సైట్‌లో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అభిమానులు, ప్రజాశ్రేయస్సుకోరే వారంతా కార్యక్రమాల అమలుకు చేయూతనందించవచ్చు.