72 గంటల బంద్‌కు జగన్ పిలుపు

హైదరాబాద్ 03 అక్టోబర్ 2013:

కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి నిరసనగా రాష్ట్రంలో 72 గంటల బంద్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించిందని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించిన తర్వాత గురువారం రాత్రి ఆయన లోటస్ పాండ్ నివాసంలో ఆయన మీడియాతో ఆవేదన భరితంగా మాట్లాడారు.  ఈరోజు కలిగినంత బాధ 16 నెలల జైలు జీవితంలో ఏనాడు కలగలేదని ఆయన పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరిగా  చేయాలన్న సంప్రదాయాన్ని మన రాష్ట్ర విషయంలో పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు.  డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన సమయంలో కూడా అసెంబ్లీ ఆమోదం పొందుతామని చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని అమ్మేశారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితిని చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది.  విభజనకు ప్రధాన కారణం చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర లోని ఎంపీలంతా వెంటనే రాజీనామా చేయాలని శ్రీ జగన్ డిమాండ్ చేశారు. దీనివల్ల యూపీఏ సర్కారు మైనారిటీలో పడుతుందనీ, ఈ ప్రక్రియ ఆగిపోతుందని ఆయన తెలిపారు. గతంలో కొత్త రాష్ట్రాలను విడగొట్టినప్పుడు ఆయా అసెంబ్లీల్లో  తీర్మానం చేశారు. అలా ఇప్పుడెందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇటువంటి అన్యాయం చేసిన కాంగ్రెస్, చంద్రబాబు ఇద్దరూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు.  మా పార్టీ ఎంపీలం ఇద్దరం గతంలోనే రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలా చేస్తే యూపీఏ సర్కారు కూలిపోయి విభజన ప్రక్రియ నిలిచిపోతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేసి రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంత్రులు కూడా రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తే ప్రక్రియ ఆగిపోతుందన్నారు. ఈ నిర్ణయంపై కోర్టులో పోరాడతామని శ్రీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తున్న మూడు పార్టీలవైపు రావాలని చంద్రబాబు, కిరణ్ లను అడిగామనీ, వారు పట్టించుకోలేదని చెప్పారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించాలని కూడా చంద్రబాబును పదేపదే కోరినా ఉపయోగం లేకపోయిందన్నారు. త్యాగాలతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చడం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని పదేపదే కోరినా ప్రయోజనం లేకపోయిందని శ్రీ జగన్ చెప్పారు. ఇదే అంశంపై తాము గవర్నరును కూడా కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Back to Top