వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం

 మమ్మల్ని దోషులుగా చిత్రీకరించేందుకు కుతంత్రం

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం

తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీడీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీ వెంకటేశ్వరస్వామితో ఇంకా చంద్రబాబు ఆటలు

సుప్రీంకోర్టునూ అవహేళన చేసేలా కొత్త కమిటీ

సిట్ దర్యాప్తుతో సాగని చంద్రబాబు ఆటలు

అందుకే కొత్త కమిటీ పేరుతో మరో డ్రామా

సిట్ సిఫార్సుల్ని ఎందుకు బయటపెట్టలేదు?

రాజకీయ కుట్ర సాగదీతకే ఈ డ్రామాలు

మా నేతల్ని దోషులుగా చూపించే కుట్ర

ప్రజాకోర్టులో బాబుకు శిక్ష తప్పదు

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన హెచ్చరిక

తిరుపతి:     తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయ్యిందంటూ చేసిన రాజకీయ కుట్రలు ఫలించకపోవడంతో సిట్ దర్యాప్తు తర్వాత కూడా వన్ మ్యాన్ కమిటీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని టీడీడీ మాజీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. సిట్ రిపోర్ట్ లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు క్లీన్ చిట్ లభించడంతో, ఏదో విధంగా వారిని నెయ్యి వివాదంలో ఇరికించాలనే చంద్రబాబు ఈ కొత్త కుట్రలకు దిగారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని శ్రీవారికి క్షమాపణలు చెప్పకపోతే ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో భూమన ఇంకేమన్నారంటే....

సుప్రీంకోర్టును అవహేళన చేసేలా కొత్త కమిటీ

    శ్రీ వెంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం కొనసాగుతోంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ ఏడాది పాటు సుదీర్ఘంగా 8 రాష్ట్రాల్లో విచారణ చేసిన తర్వాత కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించాక వన్ మ్యాన్ కమిటీ వేయడం హాస్యాస్పదంగా ఉంది. సంవత్సరం క్రితం వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం కోసం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై వన్ మ్యాచ్ కమిటీ వేసి ఎవరి శిక్షించాలో, ఎవరిని రక్షించాలో ముందుగా నిర్దారించుకుని నివేదిక ఇప్పించుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీబీఐ సిట్ దర్యాప్తు చేశాక చంద్రబాబు లడ్డూ ప్రసాదంపైన రాజకీయ కుట్రకు పాల్పడి, దేవుడి ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లిస్తున్నా తప్పు తెలుసుకుని లెంపలేసుకోకుండా ఎదురుదాడి కోసమే ఈ కమిటీ వేశారని అర్థమవుతోంది. 

సిట్ దర్యాప్తులో ఆటలు సాగలేదని కొత్త డ్రామా

    సీబీఐ సిట్ తన కనుసన్నల్లో దర్యాప్తు జరపలేదని, వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద, జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయలేదు కాబట్టి, తన కుట్రలు సాగలేదు కాబట్టి ఈ కమిటీ వేసినట్లు అర్థమవుతోంది. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సిట్ దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశంపై మళ్లీ కమిటీ వేయడం ఆశ్చర్యం కలిగించేది, సుప్రీంకోర్టును అవహేళన చేసేదిగా ఈ కమిటీ ఉంది. సీబీఐ సిట్ ఛార్జిషీట్ వేశాక ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని మంత్రులు కేబినెట్ సమావేశంలోనే చెప్పారు. ఆ సిఫార్సులు ఏంటో ఇప్పటివరకూ ప్రభుత్వం బయటపెట్టలేదు. ప్రభుత్వం సిట్ సిఫార్సుల్ని అమలు చేయకుండా, మళ్లీ మమ్మల్ని నిందితులుగా చేసేలా, ఈ రాజకీయ కుట్రను మరింత సాగదీసేందుకే ఈ డ్రామా చేస్తున్నారు. ఇది చంద్రబాబు మరో కొత్త నాటకం. తన చేతిలో ఉన్న మీడియా ద్వారా సొంతంగా విచారణ జరిపి,మమ్మల్ని దోషులుగా చేసి గిట్టని వారిపై నిందలు వేయాలనే ప్రయత్నం ఇది. శిక్షించే అధికారం న్యాయస్దానానిదా, చంద్రబాబుదా ? ఈ నాటకం బదులు చంద్రబాబే తన నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీ వేసుకుని ఉంటే సరిపోయేది. ఆయనే దర్యాప్తు చేసి, ఆయనే మిమ్మల్ని దోషులుగా చూపించి తీర్పులు ఇచ్చేస్తే సరిపోయేది. చంద్రబాబుకు సుప్రీంకోర్టు సహా ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదని దీన్ని బట్టి మరోసారి తేలిపోయింది. 

గుట్టురట్టుతోనే చంద్రబాబుకు పూనకాలు

    కల్తీ నెయ్యి చంద్రబాబు బుర్రలోనే కాదు హెరిటేజ్ లోనే ప్రారంభమయ్యిందనే రహస్యం శ్రీవారే బయటపెట్టారు కాబట్టే ఆయనకు పూనకాలు వస్తున్నాయి. కుటిల రాజకీయ కుయుక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేయడానికే ఈ కమిటీ వేశారు. ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగి ఉంటే అందుకు మొదటి బాధ్యుడు చంద్రబాబే. ఎందుకంటే భోలే బాబా అనే సంస్థను తెచ్చింది చంద్రబాబే కాబట్టి. ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2019 వరకూ చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధరకు  80 శాతంపైగా నెయ్యి సరఫరా చేసింది కాబట్టి దానిపై విచారణ చేయించాలని మేం అడిగాం. కంపు కాలికింద పెట్టుకుని ఊరిమీద తిరిగినట్లుంది చంద్రబాబు తీరు. హెరిటేజ్, ఇందాపూర్, భోలేబాబాకు ఉన్న సంబంధం నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. 

వైయ‌స్ఆర్‌సీపీ​ నేతల్ని దోషులుగా చిత్రీకరించే కుట్ర

చంద్రబాబు రాజకీయ ఎజెండాకు తప్ప, జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లేందుకు తప్ప ఈ వన్ మ్యాన్ కమిటీ ఎందుకు పనికి రాదు. టీటీడీలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటే అనిల్ సింఘాల్ ను బదిలీ చేశారు, బాలాజీని సెలవుమీదా పంపారు. మమ్మల్ని ఎలాగైనా దోషులుగా నిలబెట్టాలని, అలాగే వచ్చే 45 రోజుల్లో పచ్చ మీడియాలో బాకాలు ఊదించుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటు చేశారు.  చంద్రబాబు తన తప్పిదాలు ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.

Back to Top