ఆరోపణలు తప్పు అని నిరూపించు.. లేదా మాట్లాడకుఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా), 2 డిసెంబర్ 2012: 'నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్' అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. ‘నీపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని నిరూపించుకోవాలని, లేదంటే నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది’ అని నాగిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో నాగిరెడ్డి శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు.ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ తోటి మహిళా నాయకురాలిపై ఎలా మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో పయ్యావుల ఉన్నారని భూమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేశవ్ సన్నిహితుడికి చెందిన ఎస్ఆర్ మినరల్సుకు ఓబుళాపురం గనులను కట్టబెట్టేందుకు ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో వెల్లడించాల్సింది పోయి... వాస్తవాలను కప్పిపుచ్చుకొనేందుకు ఆమెపై సంస్కారం లేకుండా విమర్శలు చేస్తే సహించేది లేదని భూమా స్పష్టం చేశారు. శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు తదితర వైయస్‌ఆర్‌సిపి నాయకులు ఆరోపించినట్లుగా ఆ సంస్థ యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేశవ్‌దే అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభలకు కేశవ్ హాజరైనది ఓబుళాపురం గనులను తన సన్నిహితుడైన సురేంద్రబాబుకు కట్టబెట్టించుకోవడానికే అనేది బహిరంగ రహస్యమేనని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో టిడిపిలో జరిగిన వాస్తవాలనే శోభానాగిరెడ్డి ప్రస్తావించారని, అవి నిజం కాదని నిరూపించే దమ్ము కేశవ్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.
ఎస్ఆర్‌పై స్పందించలేదేం బాబూ?:ఓబుళాపురం గనులను ఎస్ఆర్ మినరల్సుకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కానీ, టిడిపి నాయకులు కానీ ఎందుకు స్పందించడం లేదని భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. ‘మీకు దక్కితే ఒక న్యాయం... వేరొకరికైతే ఇంకో న్యాయమా...’ అని విమర్శించారు. గతంలో టిడిపిలో ఉన్న తాము ఆ పార్టీకి అన్ని వేళలా సేవ చేస్తే, ఫలితంగా అందిన ఫలాలను కేశవ్‌లాంటి వారు అనుభవించారని ఆరోపించారు. తాము ఎప్పుడూ టిడిపిపై ఆధారపడి రాజకీయం చేయలేదని, తమపై ఆధారపడే ఆ పార్టీ రాజకీయాలు కొనసాగించిందని గుర్తు చేశారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనన్నారు. తెరమరుగైన పార్టీల జాబితాలో టిడిపి కూడా చేరిపోనుందని, కార్యకర్తలను మభ్యపెట్టడానికే ఇంకా వైద్యం చేస్తూ బతికి ఉన్నట్లుగా మభ్యపెడుతున్నారని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.