డిటిటల్‌ బ్యాంకింగ్‌ ఎలా సాధ్యం?

ఏలూరు: పబ్లిసిటీ కోసమే వందశాతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారని, వందశాతం అక్షరాస్యత సాధించకుండా..హండ్రెడ్‌ పర్సెంట్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎలా సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ఏలూరులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..  పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ ఏర్పడిందన్నారు. రెండు వేల కోసం సామాన్యుడు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఇబ్బంది పడుతున్నారని రోజా అన్నారు. అమెరికాలోనే డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదని, అలాంటప్పుడు, మనదేశంలో ఎలా సాధ్యమవుతుందని  ప్రశ్నించారు. 

చంద్రబాబు తన  నల్లధనాన్ని మార్చుకునేందుకు ఏ విధంగా హెరిటేజ్‌ సంస్థలను అమ్మేసుకున్నారో కళ్లారా చూశామని అన్నారు. కేంద్రంలో కార్పొరేట్‌ శక్తులకు  ప్రధాని నరేంద్ర మోదీ అభయమిస్తే, ఏపీలో మాత్రం తన కుటుంబానికి చెందిన సంస్థలకు ఏ విధంగా న్యాయం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి ముందు చూపులేకపోవడం వల్లే ప్రజలకు కరెన్సీ కష్టాలు ఎదురవుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు హెరిటేజ్‌లో షేర్లు అమ్మి బిగ్‌బజార్‌లో కొన్నారని ఆరోపించారు. అందుకే చిల్లర కోసం బిగ్‌బజార్‌కు వెళ్లమంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. 
 
Back to Top