ఎన్నికలపై ప్రభుత్వ అప్రజాస్వామిక 'పంచాయతీ'

ఖమ్మం 27 జూన్ 2013:

రాజశేఖరరెడ్డిగారిని ప్రేమించే ప్రతి హృదయానికి నమస్కరిస్తున్నాని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్న శ్రీమతి విజయమ్మ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మంలోని బోనకల్ రోడ్డులో ఉన్న ఓ కళ్యాణమంటపంలో ఏర్పటైన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ కోసం, వైయస్ఆర్ గారి కోసం మరణించిన వారికోసం తొలుత ఆమె రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.   పార్టీ రహితంగా జరిగే ఎన్నికలలో తమదే ఆధిపత్యమని చాటుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి గారి  జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. ఆయన కార్యకర్తలకు ఎంతో గౌరవమిచ్చేవారనీ, ఈ విషయాన్ని తాను చెప్పాల్సిన అవసరం లేదనీ తెలిపారు. మీరే ఆయనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారన్నారు. 34 సంవత్సరాలు మీ భుజాలమీద  రాజనన్ను మోశారన్నారు. మీ ఎనలేని సహకారానికి మా కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. మీరు చూపించిన ప్రేమ కారణంగానే మేమీ రోజు మీ ముందుకు రాగలిగామన్నారు. ఇలా అంటున్నప్పుడు ఆమె గొంతుక జీరబోయింది. గద్గద స్వరంతో మాట్లాడారు. జగన్ బాబు, షర్మిల పట్ల చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు చెప్పారు.

పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికలు సదవకాశం
 రెండేళ్ళ క్రితం పుట్టిన మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి పంచాయతీ ఎన్నికలు అమూల్యమైన అవకాశమనీ.. వీటిలో మన సత్తా చాటాలనీ శ్రీమతి విజయమ్మ కోరారు. స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలకే  పార్టీ అవకాశమిస్తుందన్నారు. వీటిలో గెలిచి మంచి నాయకులుగా ఎదగడానికి పార్టీ సహకరిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలను పక్కన పెట్టి ఐకమత్యంగా ఎన్నికలలో పనిచేసి గెలవాలని ఆమె సూచించారు. మీ పునాదిని పటిష్టం చేసుకుని తద్వారా పార్టీని కూడా బలీయ శక్తిగా మార్చాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం రెండేళ్లుగా జాప్యం చేస్తోందన్నారు. దీనివల్ల పంచాయతీలు సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఎన్నికలు సకాలంలో జరిగుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అధికారులు ప్రభుత్వానికే జవాబుదారీ అనీ.. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారనీ పేర్కొన్నారు. పంచాయతీలకు అధికారాలివ్వాలన్న రాజ్యాంగ శాసనాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.  ఇంతవరకూ రిజర్వేషన్లు, జనాభా లెక్కలు అంటూ జాప్యం చేస్తూ వచ్చారన్నారు. రిజర్వేషన్ల గురించిన వివరాలను ఆమె గణాంకాలతో తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డిగారు బీసీలను ఎక్కువ సంఖ్యలో ఎన్నికలలో నిలబెడదామని సూచిస్తూ రాసిన లేఖకు ఏ పార్టీ స్పందించలేదన్నారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు అత్యవసరమని చెప్పారు. ఎన్నికలు జరగని కారణంగా పంచాయతీలకు రావలసిన రూ. 4000 కోట్లు , 350 కోట్ల  బీఆర్జీఎఫ్ నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు పాలించిన తొమ్మిదేళ్ళలో 2000 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను వేరే పనులకు మళ్లించారని ఆమె ధ్వజమెత్తారు.

పంచాయతీలకు నిధులూ, విధులూ సమకూర్చిన రాజన్న
రాజన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు అన్ని విధులూ కల్పించారనీ, ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్ కల్పించిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తు చేశారు. పంచాయతీలకు ప్రభుత్వం కరెంటు బిల్లులను చెల్లించకపోవడంతో గ్రామాలు చీకట్లో ఉంటున్నాయనీ, మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయనీ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇవి ఇబ్బడిముబ్బడిగా అయ్యాయన్నారు. స్థానిక సంస్థలలో అధికారానికి కార్యకర్తలు దూరంగా ఉన్నాయన్నారు. నిదులు రాకపోవడం, కేంద్రం వత్తిడి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు పెట్టారన్నారు. ఎన్నికలయ్యంత వకూ జగన్ బాబును జైలునుంచి విడుదల చేయద్దని ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రానికి చెప్పారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.   స్థానిక సంస్థలలో ఆధిపత్యాన్ని సాధించడానికి కాంగ్రెస ఆరాటపడుతోందన్నారు. జగన్ బాబును అప్రతిష్ట పాలు చేయడం వారి లక్ష్యంగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలను గడప,గడపకూ వెళ్లి వివరించాలన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలన్నీ ఎదుర్కొవాలన్నారు.

ఆత్మవిశ్వాసం మంచిదే.. అలసత్వం తగదు
ఈ ఎన్నికలనుంచే పార్టీ పటిష్టపరుచుకుందామని కోరారు. అత్యుత్సాహానికి తావీయరాదని శ్రీమతి విజయమ్మ హితవు పలికారు. గెలుస్తామనే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ ఆ కారణంగా అలసత్వం ప్రదర్శించరాదన్నారు. నాయకుల మద్య సమన్వయం కొరవడిందని పేర్కొన్నారు. దానిని ప్రతి పంచాయతీలోనూ గెలవాలన్నారు. మనది గెలిచే పార్టీ అని ఆమె స్పష్టంచేశారు. మీ స్థానిక నాయకులతో మాట్లాడుకుని ఎవరు ఎలా పోటీచేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఓట్లర్ల జాబితాపై నిఘా పెట్టాలని కోరారు. ప్రభుత్వం ఓటర్లను తొలగించాలని చూస్తోందన్నారు.  సంతకం పెట్టేవరకూ పోలింగు బూత్ నుంచి బయటకు వెళ్ళకూడదన్నారు. నిర్ణీత ప్రణాళికతో ఎన్నికలలో ముందుకు సాగాలన్నారు. అందరితో సమన్వయంతో సాగాలనీ, తాను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాననీ పేర్కొన్నారు.

ప్రజాపథం ఆదర్శం కావాలి
పంచాయతీలలో ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై ఏదైన  సమస్య వచ్చినప్పుడు న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రజా సమస్యలపై స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. అన్ని అంశాలపై పోరాటం చేసి మంచి నాయకులుగా నిరూపించుకోవాలన్నారు. రాజన్న ప్రతి ఏటా ప్రజా పథం నిర్వహించి అందులో సమస్యలకు సమాధానం ఇచ్చేవారనీ, తీర్చేవారనీ చెప్పారు. ఇలాంటి నాయకుడు ఇప్పుడు లేరన్నారు. తాము గెలిస్తే ఇలాగే ఉంటామనే భరోసా ప్రజలకు కల్పించాలన్నారు.
రాజన్న తన రాజకీయ జీవితకంలో ఎన్నో ఆందోళనలు చేశారన్నారు. ఏం అంశంపై ఏంచేయాలనే అంశంపై ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. తెలంగాణ వెనుకబాటు తనం కూడా ఆయనకు తెలుసనీ, అందుకే అనేక కార్యక్రమాలు చేపట్టారనీ గుర్తుచేశారు. అన్ని రంగాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 'ఆయన ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్తుపై సంతకం చేశారు. రుణాలు మాఫీ చేశారు' అని వివరించారు. వడ్డీ మాఫీ చేసి, రీ షెడ్యూలు చేశారన్నారు. ఆయన హయాంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఏ ధరా పెరగలేదన్నారు.

ధాన్యం ధర బాబు హయాంలో 90రూపాయలే పెరిగితే... రాజన్న హయంలో ఏటా వంద పెరిగిందన్నారు. పంట ఎక్కువ పండినపుడు ఎఫ్ సీ ఐ తో మాట్లాడి కొనిపించారని తెలిపారు. వ్యవసాయ దిగుబడుల ధరలను కూడా గణాంకాలతో వివరించారు. తెలంగాణ ప్రాంత రైతులకు వడ్డీ మాఫీలో 70 శాతం ప్రయోజనం కలిగిందన్నారు. ప్రతి నీటిచుక్కా ఉపయోగపడాలని జలయజ్ఞం చేపట్టారన్నారు. రాజన్న ఉండుంటే ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. రాజన్న ప్రాంతంతో సంబంధం లేదన్నారు. అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. వచ్చిన సాఫ్టు వేర్ కంపెనీలను వివరించారు. రాజన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తెచ్చారన్నారు.

లక్షలాదిమంది గిరిజనులకు భూమి పట్టాలిచ్చారు
ఖమ్మ జిల్లాకు 2006 లో మహానేత డాక్టర్ వైయస్ఆర్ పోడు భూముల చట్టం తెచ్చారని తెలిపారు. నాలుగు రెవెన్యూ డివిజన్లలో గిరిజనులకు పట్టాలిచ్చారన్నారు. లక్షలాది ఎకరాలు పంపిణీ చేశారన్నారు. ఎస్సీలకు 500 కోట్లిచ్చి ఇందిరా జలప్రభ ప్రవేశపెట్టారన్నారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, దమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టులు  చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ముంపు ప్రాంతాలకు ప్రత్యే క ప్యాకేజీ ఇస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అది ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుందన్నారు. ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆయనకు తెలుసనీ, ఆ మేరకు కార్యక్రమాలు చేపట్టారనీ చెప్పారు. 80 లక్షల ఇళ్ళకు శ్రీకారం చుట్టారు. గ్యాస్ ధర పెంచకుండా చూశారన్నరు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రస్తుతం 108 కనిపించడం లేదన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చూశారన్నారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలిచ్చారన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు ప్రవేశపెట్టారన్నారు. ఆయన హయాంలో ఏ చార్జీ పెరగని విషయాన్ని ఎవరూ మరిచిపోలేదన్నారు.
ఇప్పుడన్నీ భారమే
ప్రస్తుతం కరెంటు రూపేణా వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ చార్జీలను చంద్రబాబు ఐదు సార్లు, ఈ ప్రభుత్వం మూడు సార్లు పెంచాయని తెలిపారు. 'పల్లెల్లో కరెంటు లేదు. పెట్రోలు  15 సార్లు పెంచారు. పరిశ్రమలలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 20 వేల కోట్లు  ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం. ఎవరికీ పరిహారం అందలేదు. వడ్డీ లేని రుణాలిస్తామని వడ్డీ వసూలు చేస్తున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు ఎలా పెరిగిందీ విజయమ్మ వివరించారు.

అమ్మహస్తం కాదు మాయా హస్తం
అమ్మహస్తం పథకంపై విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లాలో పంచదార బదులు 200 ప్యాకెట్ల యూరియ వచ్చిందన్నారు. ఏటా బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారని దానివల్ల వారికి ఉపయోగం లేకుండా ఉందనీ చెప్పారు. రాజీవ్ ఉద్యోగశ్రీనే రాజీవ్ యువకిరణాలుగా మార్చారని చెప్పారు. లక్షలాది ఉద్యోగాలిచ్చామని చెప్పారు.. ఎక్కడా కనిపించలేదని నిలదీశారు. రాజన్న పథకాలకే కొత్త పేర్లు పెట్టుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

బాబు రాజకీయ జీవితం కుట్రలమయం
చంద్రబాబుకు కూడా ఓటు ఎందుకు వేయకూడదో కూడా ఆమె వివరించారు. ఆయన రాజకీయ జీవితమంతా కుట్రలు కుతంత్రాలు, స్వప్రయోజనాలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటినుంచి టీడీపీలోకి వచ్చి ముఖ్యమంత్రయ్యి ఎలా వ్యవహరించిందీ ఆమె కళ్ళకు కట్టేలా తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. ఎంపీ, ఉప ఎన్నికలలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిన విషయాన్నీ, ఎఫ్ డీ ఐ బిల్లు సమయంలో ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవిశ్వాస సమయంలో విప్ జారీ చేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. ఈ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ ఆయన కాపాడుతున్నారని చెప్పారు. ఆయన మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని రుజువైందన్నారు. అన్నీ నాటకాలే ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ఏం చెబితే కిరణ్ అది చేస్తారన్నారు. మంత్రుల తొలగింపే దీనికి రుజువన్నారు. ఎమ్మెల్యేలను అనర్హులను చేయడంలో జాప్యం చేశారన్నారు. ఎన్నికలు నిర్వహించి ఉంటే వారంతా తమ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఉండేవారన్నారు.

వ్యంగ్యోక్తులతో కాలం వెళ్ళదీత
కిరణ్ కుమార్ రెడ్డి బాబును వాకింగ్ ఫ్రెండనీ, బాబు కిరణ్ కుమార్ రెడ్డిని ఫ్లైయింగ్ ఫ్రెండనీ చమత్కరించుకుంటూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించినపుడు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. బషీర్ బాగ్ కాల్పులు, తదితర సంఘటనల సమయంలో మీడియాను బాబు ఎలా మేనేజ్ చేసింది చెప్పారు. మద్యపాన నిషేధ సమయంలో ఈనాడు పత్రిక బాబును ఎలా ఆకాశానికెత్తిందీ వివరించారు. అన్ని పనులనూ ప్రజల చేతే చేయించిన వైనాన్నీ తెలియజేశారు. చిత్తూరు డెయిరీని ఎలా నిర్వీర్యం చేసిందీ తెలిపారు. ఎల్ అండ్ టీ తో పార్టీ భవనం కట్టించుకున్నారన్నారు.  ఐఎమ్ జీ కి 850 ఎకరాలు మూడు కోట్లకు ఇచ్చారు. ఎవరెవరికి ఎంతెంత అతి తక్కువ ధరకు ఇచ్చిందీ తెలిపారు. రాజన్న అయితే జిల్లాల్లో ఇచ్చారు. ఎల్లో మీడియాలో రాజన్న మీద విష ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రచారాన్నీ తెలిపారు. బయ్యారం గురించి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాజన్న పథకాలన్నీ నేను అమలు చేస్తానని చెబుతున్నారన్నారు. ఆయనకు వాగ్దానాలను నిలబెట్టుకోవడం తెలీదనీ ఆ వివరాలను కూడా తెలియజేశారు.

బాబు మాటలకూ, చేతలకూ పొంతన కరవు
లోకకల్యాణం, నీతిమంతమైన పాలన, కేంద్రాన్ని గాడిలో పెడతా అంటూ చెబుతున్నారనీ ఆయన చేతలకూ, మాటలకూ పొంతన ఉండదనీ చెప్పారు. ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలలలో ఏ కోర్టు ఆయనను విచారించలేదన్నారు. సీబీఐ విచారణకు సిబ్బంది లేదని చెప్పిందన్నారు.
ప్రజలకు నిజాలు తెలుసని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. వైయస్ఆర్ కుటుంబం మీద విష ప్రచారం జరుగుతోందన్నారు. రాజన్న, గానీ జగన్ గానీ దోషి కాదన్నారు. సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని ఆ సంస్థ ఉన్నతాధికారులే చెబుతున్నారన్నారు. పేరాల కొద్దీ అంశాలను తొలగిస్తున్న అంశాన్ని గుర్తుచేశారు. వ్యతిరేకంగా ఉన్నవారి మీద కేంద్రం సీబీఐని ప్రయోగిస్తోందన్నారు. ములాయం, జయలలిత.. ఇలా ఎవరైనా కేంద్రం బాధితులేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో జగన్ బాబు ఉన్నంతకాలం ఏ చర్యా తీసుకోలేదన్నారు. పార్టీ వీడిన అనంతరం కేసులు మొదలయ్యాయన్నారు. మీరు ఆయనపై ఆదరణ చూపిస్తుండడం తట్టుకోలేక తమ ఆటలు చెల్లవని కాంగ్రెస్ ఈ రకంగా వ్యవహరిస్తోందన్నారు. 26 జివోల విషయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. సీబీఐ విచారణ సాగుతూనే ఉంది. 24 గంటల్లో 28 బృందాలతో దాడులు చేశారన్నారు. జగన్ బాబుకు వ్యతిరేకంగా చెప్పలేదని మ్యాట్రిక్సు ప్రసాద్ గారిని ఏడాది పైగా జైలులో ఉంచారన్నారు. దర్యాప్తు చేయకుండా చార్జిషీట్లు వేస్తారని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ ప్రేరేపితమేనని ఆమె స్పష్టంచేశారు. .జీవొల విషయంలో విచారణ లేకుండానే జగన్ పై చార్జి షీటు వేశారన్నారు. విచారణ పూర్తి కాలేదంటూ గడువు అడుగుతున్నారన్నారు.

మహానేత డాక్టర్ వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్ బాబుకు సండూర్ పవర్ ప్రాజెక్టు ఉందన్నారు. భారతి సిమెంట్సులో పెట్టుబడులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవైతే లాభాలు ఎందుకు పంచుతారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. సాక్షి విషయమూ అంతేనన్నారు. రాజశేఖరరెడ్డిగారు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన భూముల గురించీ, ఏర్పాటుచేసిన విద్యాసంస్థల గురించీ తెలియజేశారు. విచారణ మొదలై 23 నెలలైందనీ, ఈ సమయంలో జగన్ తప్పు ఏమైనా ఉందో తేలిందా అని ఆమె ప్రశ్నించారు. జగన్ బాబు తప్పు చేశాడని రుజువుచేయలేకపోయారన్నారు. విచారణ ఓ పథకం ప్రకారం సాగుతోందన్నారు. బెయిలు రాకుండా చేయడానికే ఈ కుట్రని ఆరోపించారు.

35 ఏళ్ళ సేవకు ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చడమా ప్రతిఫలం!
మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి రాజన్న చేసిన సేవలకు ప్రతిఫలమా ఎఫ్ ఐ ఆర్ లో పేరు చేర్చడం అని ఆమె ప్రశ్నించారు. రాజన్న ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడన్నారు. బోఫోర్సు కేసులో రాజీవ్ చనిపోయినతరవాత ఆయన పేరు తీసేశారు. రాజన్న విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఆయన చనిపోయిన తరవాత 26 జీవోల కేసులో ఆయన పేరు చేరర్చారన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం పాటిస్తున్నారన్నారు. ఏం తప్పు చేశాడని జగన్ బాబును ఉరితీయాలి.. దేశం నుంచి బహిష్కరించాలి అని శ్రీమతి విజయమ్మ ఆవేదనగా ప్రశ్నించారు.
తమ కుటుంబంపై ప్రేమాభిమానాలను కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ముగించారు.

Back to Top