తెలంగాణ వచ్చినా అడ్డుకుంటామనడమేంటి?

హైదరాబాద్:

శ్రీ వైయస్ జగ‌న్ ఖమ్మంలో చేయతలపెట్టిన ‘వై‌యస్ఆర్ జనభేరి’ని అడ్డుకుంటామని తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ నేతలు పిలుపునివ్వడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అడ్డుకోవాలంటూ పిలుపునివ్వడంలోని ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. టీ-జేఏసీ నేతలు దొరల మాట వినడం మంచిది కాదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో గట్టు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడినందున రాష్ట్రాభివృద్ధికి అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లాలి తప్పితే.. అణచివేత కొనసాగుతుందని చెప్పడం టీ-జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు తగదని గట్టు హితవు పలికారు. వారికి తెలంగాణపై ఉన్న అభిమానం కంటే అధికారంపైనే కోరిక ఎక్కువ ఉన్నట్టుందని విమర్శించారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలేనని, అది ఎన్నికల్లో తేలుతుందన్నారు. ప్రజాభిమానాన్ని పక్కన పెట్టి అడ్డుకుంటామని పిలుపునివ్వడం ప్రజాస్వామిక చర్య కాదన్నారు.

భవిష్యత్తులో మరో నేత వచ్చి నాలుగైదు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌తో కేసీఆర్, కోదండరాంలను అడ్డుకుంటామని పిలుపునిస్తే అంగీకరిస్తారా? అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించడం పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ఏర్పడినందున ఇక నుంచి అయినా రెచ్చగొట్టే ప్రకటనలు ఆపాలని గట్టు కోరారు.

Back to Top