టీఆర్ఎస్ యత్నాన్ని వమ్ము చేయాలి: గట్టు

హైదరాబాద్ 17 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్ ప్రసంగించారు.
హైదరాబాద్ రాష్ట్రం విముక్తి చెందిన రోజిదని గట్టు రామచంద్రరావు చెప్పారు. కాశ్మీర్, హైదరాబాద్ లకు నిజాం ప్రభువు కబంధ హస్తాలనుంచి అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కల్పించారని చెప్పారు. 1946 నుంచి 1956 వరకూ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ఆ సమయంలో రజాకార్ మూకలు కుటుంబాలపై పడి నానా అరాచకమూ చేశాయన్నారు. అత్యాచారాలు చేసి, హత్యలకు కూడా పాల్పడ్డారని తెలిపారు. అలాంటి మూకల్ని తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించారన్నారు. అలాంటి పోరాటాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి తెలంగాణ పేరుతో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అనే సున్నితమైన అంశంమీద తేళ్ళలాగ చేరిన వ్యక్తులు విషపూరితం చేసి, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. నాటి పోరాటాన్నీ, నేటి పోరాటాన్నీ ఒకేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు జరిగింది పేదవాడు, భూస్వాములకు వ్యతిరేకంగా చేసినదని చెప్పారు. ఆనాటి పోరాటంలో గ్రామాలు వదిలిపెట్టి, పట్టణాలకు వెళ్ళి తల దాచుకున్న భూస్వాములు తెలంగాణ పోరాటంతో టీఆర్ఎస్ వెనుక చేరి ప్రజల్ని దోచుకోవడానికి మరోసారి ప్రయత్నిస్తున్నారని గట్టు ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ పోరాటంగా చిత్రీకరించడం తగదని ఆయన టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు జాతిని ఒకటిగా ఉంచుతామని ఆనాడు మహాత్మా గాంధీ మాటిచ్చారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top