మంత్రివర్గ విస్తరణ రాజకీయ ఎత్తుగడ


ఓట్ల కోసమే చంద్రబాబు వికృత క్రీడలు
టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారు
వైయస్‌ఆర్‌ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరిగింది
మళ్లీ వైయస్‌ జగన్‌తోనే అది సాధ్యం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌

హైదరాబాద్‌: నాలుగున్నరేళ్లుగా మైనార్టీలను ఎందుకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహ్మద్‌ ఇక్బాల్‌ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ముస్లిం నాయకుడిని కేబినెట్‌లో స్థానం కల్పించారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహ్మద్‌ ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలను చంద్రబాబు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. మైనార్టీలను అభివృద్ధి చేయాలని ఆలోచనలో చంద్రబాబులో ఓ కోశన లేదన్నారు. ముచ్చటగా మూడు నెలల కోసం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారే గానీ.. బీజేపీకి వ్యతిరేకంగా అని మాత్రం చెప్పడం లేదని దుయ్యబట్టారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో ముస్లింలను నవాబులుగా గుర్తించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఉర్దూ పాఠశాలలు మూసివేత దిశగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  లౌకికవాదానికి ఎప్పుడూ టీడీపీ నాయకులు తిలోదకాలు ఇస్తారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీ గట్టి గుణపాఠం చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని టీడీపీ, ముస్లిం మనోభావాలు దెబ్బ తీస్తుందని ఆరోపించారు. 

ముస్లింలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని ఇక్బాల్‌ అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ కుటుంబంపై ఇంకా అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందని, ప్రతిపక్ష పోరాటం చూసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని బీజేపీ నుంచి బయటకు వచ్చారన్నారు. బీజేపీతో చంద్రబాబుతో ఇంకా రహస్య సంబంధాలు ఉన్నాయనడానికి టీటీడీలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సతీమణి మెంబర్‌షిప్‌ నిదర్శనమన్నారు. ఓటు రాజకీయాల కోసం మంత్రివర్గ విస్తరణ చేశారన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముస్లింలకు ఏ కోశాన న్యాయం చేసేలా లేదన్నారు. నంద్యాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చోవాలని ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన తొమ్మిది మంది మైనార్టీ యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారన్నారు. చంద్రబాబు న్యాయం, ధర్మ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నుంచి అక్రమ కేసులు బనాయించే వరకు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశాడన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విని ప్రజలంతా నవ్వుతున్నారన్నారు. ముస్లింలను గౌరవించే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని, మైనార్టీల అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఏ మతతత్వ పార్టీతో అంతర్గతంగా, బహిర్గత పొత్తులు లేవని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ఒంటరిగా పోరాటం చేస్తుందన్నారు. 
Back to Top