ఎవరి కోసం బాబూ నీ పాదయాత్ర: నారాయణ స్వామి

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికోసం పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కె. నారాయణస్వామి కోరారు. తన చర్యల వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల నమ్మకం కోల్పోయిన చంద్రబాబు ఇక ప్రజల నమ్మకం ఎలా సంపాదిస్తారని ఆయన ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ సంపూర్ణమద్య నిషేధం విధిస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచి గొలుసు దుకాణాల సంస్కృతికి తెర లేపింది నిజం కాదా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఎన్టీఆర్ రైతుల కోసం రూ.50 కే కరెంటు ఇస్తే చంద్రబాబు దానికి మంగళం పాడారన్నారు. తొమ్మిదేళ్లపాటు సీఎంగా పనిచేసిన సమయంలో పేదల గురించి, రైతుల గురించి, నేతన్నల గురించి, వ్యవసాయ కూలీల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తాను ప్రజలకు ఏదో చేస్తానంటే జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. విద్యుత్తు చార్జీల పెంపుపై ఆందోళన చేసిన ప్రజల పై, సమస్యల కోసం ఆందోళనకు దిగిన రైతులపై కాల్పులు జరిపించి వారిని పొట్టన బెట్టుకున్న సంఘటనలు ప్రజలింకా మరచి పోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ కాటికి దగ్గరవుతున్న విషయం గుర్తించిన బాబు దింపుడు కల్లం ఆశతో అనేక జిమ్మిక్కులు చేస్తున్నారని, శవానికి చొక్కా తొడిగితే లేచి కూర్చోలేదనే విషయం ఆయన గుర్తించాలన్నారు. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కాక ముందు మండుటెండలో జనం కోసం, వారి సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారన్నారు. ఆయన సీఎం కాగానే చిత్తశుద్ధితో రైతులకు ఉచిత కరెంటు, విద్యుత్తు బకాయిల మాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. 

తాజా వీడియోలు

Back to Top