ఎమ్మెల్యే హక్కుల కాలరాత: బాలినేని

ఒంగోలు: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నారని ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.  సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేయనున్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడం దీనికి తార్కాణమని ఆయన వివరించారు.  నాపట్ల ఇలాగేనా వ్యవహరించేదంటూ ప్రశ్నించారు. మార్కాపురంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేను అన్ని కార్యక్రమాలకు పిలుస్తూ కాంగ్రెస్ కండువా కప్పి తిప్పుతున్నారనీ, కాంగ్రెస్,  టీడీపీల ఐకమత్యం ఇక్కడే కనిపిస్తోందనీ బాలినేని పేర్కొన్నారు. రిమ్స్ వైద్యశాలకు కమిటీ విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా తనకు ప్రాతినిధ్యమే లేదనీ,  బయట నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కమిటీలో సభ్యులను చేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది శాసనసభా సభ్యుని హక్కును హరించడనన్నారు. దీనిపై ప్రివిలేజ్  కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే జిల్లా సమీక్ష సమావేశానికి తనకు ఆహ్వానం పంపకపోవడాన్ని తప్పుపట్టారు. పార్టీలకు అతీతంగా శాసనసభ్యులకు ఆహ్వానం పంపాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు.

Back to Top