'ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇక సహించరు'

తిరుపతి, 31 మార్చి 2013 : ప్రజలను పీల్చి పిప్పి చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కష్టార్జితంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా పరిపాలిస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన దుమ్మెత్తిపోశారు. ఈ మూడేళ్ళలో సుమారు 25 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని విద్యుత్‌ చార్జీలు పెంచడం ద్వారా కర్కశంగా, రాక్షసంగా రాష్ట్ర ప్రజలపై మోపిందని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు ఆదివారంనాడు లాంతర్లతో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు.

కరెంటు పెంచవద్దని ప్రతిపక్షాలన్నీ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతగా మొత్తుకున్నా, అనేక రోజులుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలు చేస్తున్నా కూడా కిరణ్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు రూ. 6,500 కోట్లు ప్రజలపై మరోసారి అదనపు భారాన్ని మోపడం అత్యంత దారుణం అన్నారు. ప్రభుత్వ చర్యను ప్రజలెవరూ సహించలేని, భరించలేని పరిస్థితి ఎదురవుతున్నదన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Back to Top