డిఆర్‌సి మీటింగ్‌కు వైయస్‌ఆర్‌సిపి డిమాండ్

కడప, 8 అక్టోబర్‌ 2012: వాయిదాల మీద వాయిదాలు పడుతున్న వైయస్‌ఆర్‌ కడప జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని (డిఆర్‌సి) వెంటనే నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అధికార పార్టీ వారు బిజీగా ఉన్నామని వంక చూపిస్తూ డిఆర్‌సిని నిర్వహించకపోవడాన్ని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, జిల్లాలో మారుతున్న పరిణామాలు లాంటి  ప్రాధాన్యం ఉన్న ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి వారికి లేదని దుయ్యబట్టారు. అధికారాన్ని ఎంజాయ్‌ చేస్తూ తిరగడమే వారు పరమావధిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 

జిల్లాలో పాలన పడకేసినా.. కరువు కరాళనృత్యం చేసినా సమీక్ష నిర్వహించేందుకు జిల్లా మంత్రులు తీరికలేనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మహీధరరెడ్డి రెండు నెలలుగా కడపవైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ప్రజా సమస్యల కంటే రాజకీయ పైరవీలకే కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ పాలకులపై ‌ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

వైయస్‌ఆర్ జిల్లా‌ అభివృద్ధి సమీక్షా సమావేశం ఈ నెల 5న జరగాల్సి ఉంది. అయితే మంత్రులకు తీరిక లేదన్న సాకుతో వాయిదా పడింది. దీనితో డిఆర్‌సి సమావేశాన్ని 7వ తేదీకి మార్చారు. మళ్లీ హాజరు కాలేమని మంత్రులు చెప్పడంతో సమావేశం ఇంకోసారి వాయిదాపడింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన డిఆర్‌సి సమావేశం తరువాత ఇంత వరకూ మళ్ళీ ఆ ఊసే లేదు. సమీక్షలు చేయడానికి కూడా తీరిక లేకుండా మంత్రులు వాయిదాల పేరుతో సమస్యలను గాలికి వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించమని వైయస్‌ఆర్ సిపి ఎమ్మెల్యేలు కోరుతున్నా పట్టించుకోవడంలేదు.‌

వైయస్‌ఆర్‌ జిల్లా పట్ల నిర్లక్ష్యమో లేకపోతే తనను ఈ జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించడం ఇష్టం లేదో ఏమో గాని మంత్రి మహీధర్‌రెడ్డి కడప వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు ఉండటంతో ఎవరికి వారు నియోజకవర్గాల్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ డిఆర్‌సి సమావేశం జరగకుండా శకుని పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వీడియోలు

Back to Top