ఢిల్లీ టూరులో బాబు గాభరా

హైదరాబాద్:  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఓ విషయం మాత్రం స్పష్టమైపోయింది. మూడో ఫ్రంట్‌ నేతలకు తెలుగు దేశం అధినేతంటే ఆసక్తి తగ్గిపోయిందనేది వెల్లడైపోయిందని ఢిల్లీలో వినిపించిన గుసగుసలే దీనికి కారణం. ఇకనుంచి ఆయనకంత ప్రాధాన్యత ఇవ్వకూడదని జాతీయ నాయకులు భావిస్తున్నారనీ అంటున్నారు.  టూర్ వెనుక ఉద్దేశం బీసీ డిక్లరేషన్‌ కాదనే అంశమూ  బట్టబయలైంది. బీసీలపై ఆయన ప్రేమ... నేతిబీరకాయలో నెయ్యిలాంటి తేలిపోయింది. మిత్రపక్షాల మద్దతు కూడగట్టడం కోసం- చంద్రబాబు పడిన ప్రయాస అంతా వృధా అయింది.
బీసీల ప్రేమ పుట్టుకొచ్చినట్లు... బీసీల నేతల్ని పట్టుకుని ఢిల్లీకెళ్ళిన చంద్రబాబు... తన ఉనికి కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బాగుందని చెప్పుకోడానికి శ్రమపడ్డారు. ఇందుకు కారణం...గతవారం వెలువడిన ఎన్డీటీ సర్వే. ఇది బాబు కంటిమీద కనుకును దూరం చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం గల్లంతవుతుందని ఈ సర్వే చెప్పింది. దీంతో- జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉన్న పేరు కాస్తా... పోయింది. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ, పెద్దసంఖ్యలో లోక్‌సభ సీట్లు సంపాదించుకునే బలం కానీ బాబుకు లేదని జాతీయ నాయకులకు  తెలిసిపోయింది.  హడావుడిగా హస్తినకు వెళ్ళిన చంద్రబాబు... సమాజ్‌వాది అధినేత ములాయంసింగ్‌,  జనతాదళ్‌-యు అధినేత శరద్‌యాదవ్‌, జనతాదళ్‌-ఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడ, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి లను కలిశారు. వీరందరి భేటీలోనూ మీడియా కెమెరాల కోసం- అందరితో కలిసి  సమావేశం అవుతున్నట్లు చంద్రబాబు ఫోజులిచ్చారు. ఆ తర్వాత తనతోపాటు వచ్చిన ఒక్కొక్కరినీ పంపించేశారు. జాతీయ నాయకులతో తానొక్కడే వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. ఎన్డీటీవీ సర్వే నమ్మొద్దని చంద్రబాబు వారిని కోరారు. తాను ప్రైవేటు సర్వే చేయించానని, తన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 10 నంఉచి 15 లోక్‌సభ సీట్లు వస్తాయని వెల్లడైనట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. తాను చేయించినట్లుగా చెప్పిన సర్వే ఫలితాల కాపీలను జాతీయ నేతలందరికీ చంద్రబాబు అందజేశారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు తన పట్టు నుంచి జారిపోతున్నట్లు గ్రహించిన టీడీపీ అధినేత... వారిని ఎలాగైనా తన వైపు ఉంచుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటనకు వాడుకున్నారు. ఇంతచేసినా- చంద్రబాబు ఢిల్లీ వృధానే అయింది. జాతీయ నేతలు ఆయనపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్‌లో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారుగానీ... ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొత్తానికి బీసీ డిక్లరేషన్‌కు మద్దతంటూ బాబు చేపట్టిన ఢిల్లీ టూర్‌ అసలురంగు తొందరగానే బయటపడింది. మరి దీని గురించి ఆయన ఏమని చెప్పుకుంటారో..!

Back to Top