రైతుల మేలు ఓర్చని రాక్షస పాలన

కోనసీమలో సాగు సమ్మె చేయాల్సిన దుస్థితి
మసాజ్‌ కోసం వెళ్లి రైతు కోసం అంటూ వ్యవసాయమంత్రి బిల్డప్‌
ఇరిగేషన్‌ అంటే తెలియని వ్యక్తి మంత్రి..
బాబు వైఫల్యం తో ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి
2018 కల్లా గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్న మాట ఏమైంది బాబూ
డబ్బులు దండుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణం
రైతుకు మద్దతు ధర కల్పించాలని ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగారా?
చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపాటు

రాజమండ్రి: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అవినీతిమయంగా తయారు చేసి రాక్షసత్వంతో చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత కందుల దుర్గేష్‌తో కలిసి నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనసీమ రైతులు మొట్టమొదటి సారిగా సాగు సమ్మె చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పించారని మండిపడ్డారు. మసాజ్‌ కోసం థాయ్‌లాండ్‌ వెళ్లి రైతుల కోసమని చెప్పే వ్యవసాయ మంత్రి, ఇరిగేషన్‌ అంటే తెలియని వ్యక్తిని మంత్రిగా పెట్టడంతో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రబీలో లక్ష ఎకరాలు ఎండిపోతాయని, మేము ఏం చేయలేమని ఇరిగేషన్‌ అధికారులే చేతులెత్తేసిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. 

ముందుచూపుతో వైయస్‌ఆర్‌ జలయజ్ఞం

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎగువ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నీటి వాడకాలు అధికంగా పెగుతున్నాయని ముందుచూపుతో ఆలోచించి జలయజ్ఞం పేరుతో దిగువ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. కృష్ణా డెల్టా నుంచి పులిచింతల, గోదావరి డెల్టా స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకువచ్చారన్నారు. కానీ నేటి చంద్రబాబు పాలనలో పోలవరం విషయంలో అనేక ఒడిదొడుకులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు.. అసెంబ్లీలో 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తానని ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చెప్పారని గుర్తు చేశారు. 2018 వచ్చింది ఇప్పటి వరకు ఎంత నీరు విడుదల చేశారని వారిని ప్రశ్నించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు తీసుకొచ్చి నీటిని అధికంగా వాడుకుంటున్నాయన్నారు. పోలవరం పూర్తయితే గోదావరి డెల్టా రైతులకు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. 

వాస్తవ విరుద్ధంగా చంద్రబాబు మాటలు..

గోదారమ్మా.. కన్నీరే మిగిలింది అని చంద్రబాబు అనుకూల పత్రికల్లోనే కథనాలు వస్తున్నాయని నాగిరెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నీటిని తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేశానని చంద్రబాబు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఖరీఫ్‌ పంటలో 4.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే అందులో 4.48 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారని, రబీలో 4.60 లక్షల హెక్టార్లలో 4.25 లక్షల హెక్టార్లలో వరి పండిస్తున్నారన్నారు. ఈ పంటలకు కూడా సరైన నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి సారి సాగుసమ్మె చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. ఊడ్చిన పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత చేపడుతారని, ఇవాల్టికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పంట ఎండిపోవడానికి చంద్రబాబు వైఫల్యమే కారణమన్నారు. 

మట్టి, ఇసుకను దోచేస్తున్నారు..

ప్రభుత్వం డబ్బులు దోచుకోవడానికే ప్రాజెక్టులు చేపడుతుందని నాగిరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం అంచనాలు పెంచి వందల కోట్లు జేబులు నింపుకుంటూ రైతు మేలును మరిచారని మండిపడ్డారు. కరకట్టకు అనుకొని ఉన్న మట్టి, ఇసుకను కూడా దోచేస్తూ రాక్షసత్వంతో పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ చంద్రబాబుకు అనుబంధ సంఘంగా పోలవరం పనులు బ్రహ్మాండంగా సాగుతున్నాయని మాట్లాడరన్నారు. ఇప్పుడు పనులు ఎంత వరకు వచ్చాయో ఒకసారి జయప్రకాష్‌ నారాయణ వచ్చి పరిశీలించాలన్నారు. పంటకు లాభసాటి ధర ఇస్తామని, స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత మందికి 50 శాతం అదనపు ధర అందించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరికి 50 శాతం అదనపు ధర కేటాయిస్తే రూ. 2850 ఇవ్వాలన్నారు. కానీ రూ. 15 వందలు ప్రకటించారన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచాలని అడగడంలో ఉన్న శ్రద్ధ.. రైతుల పంటకు మద్దతు ధర కల్పించాలని అడగడంలో లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 13 జిల్లాలో 71 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే ప్రస్తుతం 59 లక్షల హెక్టార్లలోనే సాగు చేస్తున్నారని అంటే 30 లక్షల ఎకరాలు బీడుగా పడిపోయిందన్నారు. రైతుల మేలు కోసం ప్రతిపక్షం, రైతు సంఘాలతో మాట్లాడని ఏకైక నియంతృత్వ (డిక్టేటర్) ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top