ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

ప్ర‌కాశం :ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని, ఇందుకోసం మొదటి నుంచీ వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తోందని పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని బెల్లంకొండవారిపాలెంలో గురువారం ఓ ప్రైవేట్‌కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఉమామహేశ్వరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పార్టీ ఫిరాయించిన వారికి పదవులు కేటాయించడం దారుణమన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగ సమస్య అధిగమించే అవకాశం ఉందని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకే రాష్ట్రానికి పలు సంస్థలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని డిమాండ్‌చేశారు.

Back to Top