తెలుగు జాతిని అవమానిస్తున్న కాంగ్రెస్, టీడీపీ

న్యూఢిల్లీ, 13 నవంబర్ 2013:

తెలుగుజాతిని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవమానిస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్‌ నాయకుడు గట్టు రామచంద్రరావు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీది ఒకటే విధాన‌ం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లాగా‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో రెండు వైఖరులు ఉండవని ఆయన బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్టీ కోరుతోందన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని గట్టు ఆరోపించారు. రాష్ట్ర విభజనను రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారని జీఓఎంకు చెప్పామన్నారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమైక్యాంగా ఉంచాలని తెలిపాని అన్నారు.

విభజన వల్ల అభివృద్ధి సాధ్యం కాదని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు భేటీ అనంతరం గట్టు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూడా అభివృద్ధినే కోరుకుంటున్నారు కానీ విభజనను కాదన్నారు. వెనకబాటుతనానికి విభజన పరిష్కారం కాదన్నారు. విడగొడితే తెలంగాణ మరింత వెనకబడిపోతుందన్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం తగదన్నారు. రాష్ట్రంలోని వెనకబాటుతనాన్ని నిర్మూలించడానికి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో కృషి చేశారు గనుకు అలాంటి పరిపాలనను ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారన్నారు.

Back to Top